తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలేవీ?

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలేవీ?

అధికారులను నిలదీస్తున్న కౌన్సిలర్లు

ప్రజాశక్తి-గుత్తి

మున్సిపాలిటీ పరిధి లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఏఏ చర్యలు చేపట్టారో చెప్పాలని పలువురు కౌన్సిలర్లు మున్సిపల్‌ అధికారులను ప్రశ్నించారు. ప్రతి కౌన్సిల్‌ సమావేశంలో చెబుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని సభ మందిరంలో ఛైర్‌పర్సన్‌ డి.వన్నూరుబీ అధ్యక్షతన సాధారణ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిలర్లు నదీముల్లా ఫారూఖ్‌, అరవింద్‌, వరదరాజులు, నరేష్‌, రమణ మాట్లాడుతూ వేసవి కాలం వచ్చిందని తాగునీటి సరఫరాకు ముందస్తు చర్యలు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. తాగునీటి సరఫరా కోసం ప్రణాళికలు ఎందుకు రూపొందించడం లేదని వైస్‌ ఛైర్‌పర్సన్‌ బి.వరలక్ష్మి ప్రశ్నించారు. తాగునీటి సంబంధించిన విద్యుత్‌ మోటార్లు మరమ్మతులు చేయాలంటే నిధులు లేవనడం భావ్యం కాదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్ము ఎక్కడికి వెళ్తోందని నిలదీశారు. అధికారులు ప్రజా సమస్యలను గాలికి వదిలేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ అధికారుల వద్ద చిత్తశుద్ధి లోపించింది అన్నారు. తమ వార్డుకు 27 రోజులుగా ఉప్పునీరు కూడా సరఫరా కావడంలేదని నీళ్లు లేకుం డా ప్రజలు ఎలా బతికేదని కౌన్సిలర్‌ ఖాజాఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ మురళీధర్‌, డిఇ రఘు, ఎఇ సాయినాథ్‌, శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ రంగయ్య, ఆర్‌ఓ వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️