దిగిరాకుంటే.. దింపేస్తాం..!

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆత్మకూరులో ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలుపుతున్నఅంగన్‌వాడీలు

         అనంతపురం కలెక్టరేట్‌ : ‘న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం తాము సమ్మెల్లోకి వెళ్లాం.. ప్రభుత్వం స్పందించి వీటి పరిష్కారంపై దృష్టి సారించాలి. ప్రభుత్వం మొండి పట్టు వీడి దిగిరాకుంటే వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్నే దింపేస్తాం’. అంటూ అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె జిల్లాలో ఉధృతంగా కొనసాగుతోంది. అన్ని మండలాల్లో నిరసన హోరుతో సమ్మె మంగళవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం అంగన్‌వాడీలపై వివిధ రూపాల్లో ఒత్తిడి చేస్తున్నప్పటికీ పట్టువిడవక పోరాట స్ఫూర్తితో ఆందోళనలను కొనసాగిస్తున్నారు. సమ్మె సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాలను మూత వేసి ఆయా ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద టెంట్లు వేసి దీక్షలు చేస్తున్నారు. ఐసిడిఎస్‌ అధికారులు, సచివాలయ సిబ్బంది బలవంతంగా అంగన్‌వాడీ కేంద్రాలను తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిని ప్రజల సాయంతో అంగన్‌వాడీలు అడ్డుకుంటున్నారు. వంటా వార్పు, సహపంక్తి భోజనాలు, ఉరితాళ్లు మొడకు వేసుకుని ఇలా పలు వినూత్న రీతిల్లో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అనంతపురం కలెక్టరేట్‌ : 8వ రోజు సమ్మెలో భాగంగా అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు రోడ్డుపై బైటాయించి సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం శిబిరం వద్దకు చేరుకుని సమ్మె కొనసాగించారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నగర అధ్యక్షురాలు జయభారతి అధ్యక్షతన నిర్వహించిన సమ్మెకు ఐఎఫ్‌టియు నాయకులు ఏసురత్నం, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా కార్యదర్శి చంద్రమోహన్‌, సిఐటియు నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముత్తుజా, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు రాజేష్‌గౌడ్‌, నగర కార్యదర్శి కృష్ణుడు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికుల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శివప్రసాద్‌, మున్సిపల్‌ ఉద్యోగులు కార్మికుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణ మద్దతుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీలు చేస్తున్న సేవలకు ఇస్తున్న వేతనాలకు పొంతన లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీస వేతనాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు గడవటం కష్టతరంగా ఉంటుందన్నారు. తెలంగాణా కంటే అదనంగా కనీస వేతనాలు ఇస్తామన్న జగన్మోహన్‌రెడ్డి తన మాటను నిలుపుకోవాలన్నారు. వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని కోరారు. అలాకాకుండా మొండిగా బెదిరింపు చర్యలకు పాల్పడి సమ్మెను అడ్డుకుంటామంటే ప్రజలంతా తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి జమున, అరుణ, రుక్మిణి, రేవతి, యశోద తదితరులు పాల్గొన్నారు.

కేంద్రాలను ఎలా తెరుస్తారు..? ‘

సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి అండగా నిలవాల్సింది పోయి దౌర్జన్యంగా అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టి ఎలా తెరుస్తారు’… అంటూ అనంతపురం నగరం రాజీవ్‌ కాలనీ మహదేవ నగర్‌లోని ప్రజలు సచివాలయ ఉద్యోగులను నిలదీశారు. మంగళవారం ఉదయం రాజీవ్‌ కాలనీ మహదేవ నగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రం వద్దకు సూపర్‌వైజర్‌, సచివాలయ ఉద్యోగులు చేరుకుని తెరిచే ప్రయత్నం చేశారు. కేంద్రానికి సరుకులు వచ్చాయి.. సెంటర్‌లో పెట్టాలంటూ తాళాలు పగులగొట్టేందుకు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎంపిటిసి సభ్యురాలు రమీజాబి, ప్రజలు అక్కడికి చేరుకుని అధికారుల చర్యను అడ్డుకున్నారు. అంగన్‌వాడీ కార్మికులు వచ్చేంత వరకు తెరవడానికి వీల్లేదని తెలియజేశారు. అంగన్‌వాడీల న్యాయమైన పోరాటంలో వారికి అండగా ఉండేలా అధికారులు వ్యవహరించాలన్నారు. అలా కాకుండా మొండిగా తాళాలు పగులగొట్టేందుకు వస్తే ప్రతిఘటిస్తామన్నారు. దీంతో అధికారులు అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

➡️