నిరుద్యోగులపై నిర్లక్ష్యం తగదు : డివైఎఫ్‌ఐ

నిరుద్యోగులపై నిర్లక్ష్యం తగదు : డివైఎఫ్‌ఐ

ఆందోళన చేస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-గుంతకల్లు రూరల్‌

నిరుద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని డివైఎఫ్‌ఐ నాయకులు అన్నారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తూ పరిశ్రమలు మరిచిన సిఎం జగన్‌ ప్రభుత్వాన్ని గద్దెదిగాలని డిమాండ్‌ చేస్తూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక డిఆర్‌ఒ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఏపీఎస్‌సి మిల్‌, కాపర్‌ ఫ్యాక్టరీ, సభ్యుల ఫ్యాక్టరీ, సిమెంటు దిమ్మల ఫ్యాక్టరీ, తోళ్ల పరిశ్రమ తదితర పరిశ్రమలు ఏర్పాటైతే సుమారు 52,000 మందికిపైగా ఉపాధి దొరుకుతుందన్నారు. దీంతోపాటు అనుబంధ రంగాల్లో మరో లక్షమందికి ఉపాధి లభించేదన్నారు. రోడ్డు రవాణా, రైలు రవాణా ఉన్న గుంతకల్లును కళేబరంగా మార్చిన ఘనత రాజకీయ నాయకులకే దక్కిందన్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సిఎం జగన్‌ అధికారంలోకవ వచ్చాక మాట తప్పి సచివాలయం ఉద్యోగులను మాత్రమే ఏజెంట్లుగా మార్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు విద్యార్థులు ఉద్యోగాలు రాక ఆఖరికి వాలంటీర్లుగా మారి జగన్‌ సేవకులుగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సిఎం జగన్‌ స్పందించి పట్టణంలో మూతబడిన పరిశ్రమలను ఏర్పాలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. వీరికి డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బి.హిమబిందు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు చరణ్‌, ప్రతాప్‌, మారుతీప్రసాద్‌, చంద్ర, వైటిసి రమేష్‌, జాకీర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️