నేడు ‘అనంత’లో రాష్ట్ర పునర్‌ నిర్మాణ సభ

‘రాష్ట్ర పునర్‌ నిర్మాణ పోరాట సభ’కు అనంతపురం జూనియర్‌ కళాశాల మైదానం సిద్ధం అవుతున్న ఏర్పాట్లు

        అనంతపురం ప్రతినిధి : కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నుంచి మొదలు పెడుతోంది. ఈ మేరకు రాష్ట్ర పునర్‌ నిర్మాణ సభ పేరుతో అనంతపురం నగరంలో నేడు బహిరంగ సభ నిర్వహించనుంది. నగరంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో ఈ సభ జరుగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ సభ కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా ఈ సభకు హాజరవుతున్నారు. ఈయనతోపాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు పాల్గొంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌ఛార్జీ మాణిక్యం ఠాకూర్‌, పిసిసి అధ్యక్షురాలు షర్మిల, సిడబ్లుసి సభ్యులు ఎన్‌.రఘువీరారెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు డాక్టర్‌ సాకే శైలజనాథ్‌లు పాల్గొంటున్నారు. రఘువీరారెడ్డి, శైలజానాథ్‌ ఇద్దరూ జిల్లాలోని పలు చోట్ల పర్యటించి, జనసమీకరణపైనా దృష్టి సారించారు.

భారీ హోర్డింగ్‌లు… కాంగ్రెస్‌ జెండాలు..

        ఎఐసిసి అధ్యక్షులు హాజరవుతున్న సభకు భారీ ఏర్పాట్లనే కాంగ్రెసు పార్టీ చేపడుతోంది. నగరంలోని జూనియర్‌ కళాశాలలో సభ జరిగే ప్రాంగణం చుట్టు భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అందులో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతోపాటు రాజశేఖర్‌రెడ్డి ఫొటోతో పెద్దఎత్తునే ఏర్పాటు చేశారు. చుట్టూ కూడా ఇదే రకమైన ప్లెక్సీలు హోర్డింగ్‌లతో నింపారు. నగరంలోని ప్రధాన కూడళ్లలోనూ కాంగ్రెసు పార్టీ జెండాలతో అలంకరించారు. ముఖ్య నాయకులకు స్వాగతంపలుకుతూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

రాష్ట్ర విభజన హామీలే ప్రధానం. ?

        రాష్ట్ర విభజన హామీలే ప్రధాన అజెండాగా ఉండే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. విభజన సమయంలో రాష్ట్రానికి కాంగ్రెసు పార్టీ ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ లాంటి అనేక హామీలిచ్చింది. 2014 తరువాత అధికారంలోకి వచ్చిన బిజెపి ఈ హమీలు వేటినీ అమలు చేయలేదు. వీటిని ప్రశ్నించే విషయంలో రాష్ట్రంలోని పార్టీలు టిడిపి, వైసిపిలు రెండూ వెనుకాడుతున్నాయి. ఈ అంశాలను ఈ సభలో కాంగ్రెస్‌ ఎత్తి చూపనుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ పునర్‌ నిర్మాణానికి బాటలు వేసేనా ?

      రాష్ట్ర పునర్‌ నిర్మాణం పేరుతో కాంగ్రెసు చేపట్టిన ఈ సభ ద్వారా రాష్ట్రంలో కాంగ్రెసు పునర్‌ నిర్మాణానికి ఏ మేరకు బాటలు పడనున్నాయన్నది రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్‌ ఇక్కడ పూర్తిగా దెబ్బతింది. దశబ్దకాలంగా పార్టీని తిరిగి పునర్‌ నిర్మాణం చేపట్టేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో పక్కనున్న కర్నాటక, తెలంగాణల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఇక్కడా పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదుకోసం అనేక ప్రయత్నాలు చేసే పనిలో పడ్డారు. సీనియర్‌ నాయకులను పార్టీలో చేర్చుకుని తిరిగి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది.

➡️