పంట నష్టపరిహారం, బీమా ఇవ్వాలి

పంట నష్టపరిహారం, బీమా ఇవ్వాలి

మోకాళ్లపై నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

 

ప్రజాశక్తి-ఉరవకొండ

వర్షాభావం కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం, బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం పట్టనంలోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొనివినూత్న రీతిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మధుసుడాన్‌, రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అన్నిరకాల రుణాలు రద్దు చేయాలని, పంటలు వేయని రైతులకు ఎకరాకు రూ.30వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంటలు వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా గత నాలుగున్నరేళ్ల నుంచి రైతులు పంట పొలాలకు పోయే హెచ్‌ఎల్‌సి, హంద్రీనీవా కాలువలపైన ఉన్న బ్రిడ్జిలు పడిపోయి రైతులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, హంద్రీనీవా, హెచ్‌ఎల్‌సి ద్వారా ప్రతి ఎకరాకూ సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో సిపిఎం మండల కార్యదర్శి ఎన్‌.మధుసూదన్‌, జిల్లా కమిటీ సభ్యులు రంగారెడ్డి, రైతుసంఘం నాయకులు సీనప్ప, మురళి, వీరాంజనేయులు, వెంకటేశులు, సిద్ధప్ప, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️