పాలసేకరణపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్‌

పాల సేకరణను పరిశీలించి, పాడి రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

          ఆత్మకూరు : జగనన్న పాలవెల్లువ కింద పాలసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ఎం.గౌతమి అధికారులను ఆదేశించారు. గురువారం నాడు ఆత్మకూరు మండలంలోని వడ్డిపల్లి, పంపనూరు తండాల్లో ఎఎంసియులలో జగనన్న పాలవెల్లువ కింద చేపడుతున్న పాలసేకరణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ కింద పాలసేకరణ ద్వారా కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో మహిళా పాడి రైతులకు వివరించాలన్నారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎఎంసియులలో అమూల్‌ సంస్థకు పాలుపోయడం ద్వారా కలిగే ప్రయోజనాలపై పాల ఉత్పత్తిదారులకు తెలియజేయాలన్నారు. మార్చి 1వ తేదీన చాలా కీలకమైన రోజని, అన్ని ఎఎంసియులకు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా పాల సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న పాలవెల్లువ కింద మహిళా పాడి రైతులకు విస్తతస్థాయిలో రుణాలు అందించాలన్నారు. పశువులు కొనుగోలు చేసేందుకు రుణాలను అందించాలన్నారు. పాడిపశువులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అడాప్షన్‌ అధికారి, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, రూట్‌ ఇన్‌ఛార్జి రమాదేవి, ఎంపిపి హేమలత, వడ్డీపల్లి సర్పంచి లక్ష్మీనారాయణ రెడ్డి, పంపనూరు తండా సర్పంచి ఎర్రిస్వామి, వెటర్నరీ అధికారులు దిలీప్‌, తులసీరామ్‌, ఏపీఎం మదన్‌ మోహన్‌, ప్రమోటర్స్‌ ధనలక్ష్మీ, నాగరత్నమ్మ, ప్రభాకర్‌, సచివాలయ ఉద్యోగులు, మహిళా పాడి రైతులు పాల్గొన్నారు.

➡️