పూర్తి స్థాయిలో ఎన్నికల నియమావళి అమలు

కలెక్టర్‌ ఎం.గౌతమి

        అనంతపురం : ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు సాధారణ ఎన్నికలు- 2024 దృష్ట్యా జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి తెలియజేశారు. శుక్రవారం నాడు కలెక్టరేట్‌ నుంచి ఎన్నికల నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై జిల్లా, మండల స్థాయి ఎన్నికల అధికారులతో టెలీ కాన్ఫిరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయడాన్ని అధికారులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌ తదితర ప్రాంతాల్లో రాజకీయ పార్టీల హోర్డింగ్స్‌, పోస్టర్లు, బ్యానర్లు, ఫొటోలు, లోగోలు ఉండడానికి వీలు లేదన్నారు. ప్రయివేటు భవనాలపై వాల్‌ రైటింగ్స్‌, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉండరాదన్నారు. రిటర్నింగ్‌ అధికారులు, ఎంసిసి టీమ్స్‌ ఎంసిసి అమలుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సంబంధిత అధికారులు ఎంసీసీ అమలుపై ప్రతిరోజూ పరిశీలన చేస్తూ ఉండాలన్నారు. ప్రభుత్వంలో పని చేస్తున్న ఎవరు కూడా రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనరాదన్నారు. వాలంటీర్లు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీజర్స్‌కు సంబంధించి ప్రతిరోజూ రిపోర్టులు అందించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వరకు ఎంసీసీ ఫిర్యాదులు వస్తుంటాయని, ఫిర్యాదులను సకాలంలో పరిష్కారానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, జిల్లా పరిషత్‌ సిఇఒ వైఖోమ్‌ నిదియా దేవి, డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డితో ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నాం: కలెక్టర్‌

          జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.గౌతమి తెలియజేశారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా వీడియో కాన్ఫిరెన్స్‌ను శుక్రవారం నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ నుంచి కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, జిల్లా పరిషత్‌ సిఇఒ వైఖోమ్‌ నిదియా దేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై క్షేత్రస్థాయిలో నిత్యం పరిశీలన చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా ఎంసిసి ఉల్లంఘన జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు కరుణకుమారి, వెన్నెల శీను, నోడల్‌ అధికారులు భాస్కర్‌, ఉమామహేశ్వరమ్మ, ఎంసిఎంసి మెంబర్‌ సెక్రెటరీ పి.గురుస్వామిశెట్టి, డిప్యూటీ కలెక్టర్‌ విశ్వనాథ్‌, ఎన్‌ఐసి డిలొ రవిశంకర్‌, ఎన్నికల సెల్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌, పాల్గొన్నారు.

➡️