పేదలకు రాజ్యాంగ హక్కులు దక్కాలి

రాజ్యాంగ ప్రవేశికతో సామూహిక ప్రతిజ్ఞ చేస్తున్న హైకోర్టు జడ్జి తదితరులు

      అనంతపురం కలెక్టరేట్‌ : పేదలందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కులు దక్కాలని, అప్పడే రాజ్యాంగం లక్ష్యం నెరవేరుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం హౌసింగ్‌ బోర్డు కాలనీలోని శ్రీవిజయనగర న్యాయ కళాశాలలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు పేదవారికి దక్కాలన్నారు. ప్రతి ఒక్కరూ ఒక జీవితాశయంతో ముందుకు సాగితే విజయం దరిచేరుతుందన్నారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశికతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రజాస్వామ్యవాదిగా పేదల న్యాయవాదిగా పేరొందిన సి.పద్మనాభ రెడ్డి చిత్రపటాన్ని, శ్రీ విజయనగర న్యాయకళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్‌ అల్మని లీగ్స్‌ అసోసియేషన్‌(అల)లోగోను హైకోర్టు న్యాయమూర్తి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు ఎ.రామిరెడ్డి, ప్రిన్సిపల్‌ రాఘవేంద్ర చార్‌, కరస్పాండెంట్‌ ఎం.శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షురాలు ఎం.శ్రీలత, జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ తోపుదుర్తి కవిత, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, సీనియర్‌ న్యాయవాది పి.గురుప్రసాద్‌, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️