బెదిరించడం కాదు.. సమస్యలు పరిష్కరించండి.. : సిపిఎం

Jan 5,2024 09:04

సమావేశంలో మాట్లాడుతున్న వి.రాంభూపాల్‌

        అనంతపురం కలెక్టరేట్‌ : సమస్యల పరిష్కారం కోసం చట్టబద్దంగా సమ్మె చేస్తున్న కార్మికులను ప్రభుత్వం బెదిరించి లొంగదీసుకోవాలనే చర్యలను మాని వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ సూచించారు. గురువారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం రాంభూపాల్‌ మాట్లాడుతూ సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్మికులు 5వ తేదీ, సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు 6వ తేదీ నాటికి విధుల్లో చేరాలని, లేని పక్షంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అధికారుల చేత నోటీసులు ఇవ్వడం దుర్మార్గం అన్నారు. అంగన్‌వాడీ సంఘాల నాయకులతో మూడుసార్లు మంత్రులు, అధికారులు చర్చలు జరిపినా ఎందుకు వారి సమస్యలను పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో అత్యంత శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను రెచ్చగొట్టే విధంగా కొందరు మంత్రులు, ఎంఎల్‌ఎలు ప్రకటనలు చేయడం, జిల్లా కలెక్టర్‌ల ద్వారా బెదరింపులు నోటీసులు ఇప్పించి సమ్మెను అణచివేయాలని చూడడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరారు. 16 రోజులుగా సమ్మెలో ఉన్న సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులనందరినీ తొలగిస్తామని జిల్లా అధికారులు ఇచ్చిన నోటీసులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల పట్ల అనుచిత వాఖ్యలు చేసిన రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కొందరు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ అధికారులు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. తాడిపత్రిలో స్వయాన ఎమ్మెల్యేనే ప్రయివేటు వ్యక్తులతో పనులు చేయించేందుకు సిద్ధపడడం దుర్మార్గం అన్నారు. దీన్ని అడ్డుకున్న కార్మికులు, వారికి అండగా నిలిచిన సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జగన్‌హన్‌రెడ్డిని అరెస్టు చేయించడాన్ని ఖండించారు. అనంతపురం కార్పొరేషన్‌లో కొందరు కార్పొరేటర్లు చెత్త తరలించే పేరుతో సమ్మెను కూడా సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. న్యాయమైన డిమాండ్‌ల కోసం సమ్మె చేస్తున్న కార్మికులకు అండగా ప్రజలను సిపిఎం కూడగడుతుందన్నారు. 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా సంఘాలు, సంస్థలు, వ్యక్తులతో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యేలకు విజ్ఞాపన పత్రాలు అందించాలని, 9వ తేదీ నుంచి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాలరంగయ్య, ఓ.నల్లప్ప, ఎస్‌.నాగేంద్ర, వి.సావిత్రి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.నాగమణి, రామాంజనేయులు, రామిరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, క్రిష్ణమూర్తి, తరిమెల నాగరాజు, భాస్కర్‌, అచ్యుత్‌, వెంకటనారాయణ, నిర్మల, ముస్కిన్‌ పాల్గొన్నారు.

➡️