బెదిరిస్తే భయపడం

Jan 6,2024 22:02

దీక్ష శిబిరంలోనే శనివారం రాత్రి నిద్రచేస్తున్న అంగన్వాడీలు, నాయకులు

                               అనంతపురం కలెక్టరేట్‌ : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఎస్మా పేరుతో బెదిరిస్తే భయపడేది లేదని . వేతనాలు పెంచేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని అంగన్‌వాడీలు తేల్చి చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి 26వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో శనివారం అంగన్వాడీలు 24 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన, చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది ఎస్మా ప్రయోగించడానికి జీవో తీసుకురావటం ప్రభుత్వ దమన నీతికి నిదర్శనం అన్నారు. దీన్ని బట్టి చూస్తే అంగన్వాడీల ఉద్యమానికి ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్థమవుతోందన్నారు. ఉద్యోగులు, కార్మికుల పోరాటాలపై ఎస్మాను ప్రయోగించిన ముఖ్యమంత్రులందరూ అధికారాన్ని కోల్పోయారని, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆ జాబితాలో చేరేందుకు సిద్ధ పడాలని హెచ్చరించారు. ఏ ఒక్క అంగన్‌వాడీ కూడా ప్రభుత్వ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అంగన్‌వాడీల ఉద్యమానికి కావాల్సిన ప్రజా మద్దతు కూడగట్టడానికి తమవంతు ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రంలో 6 నెలలు సమ్మెలను నిషేధిస్తూ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన అదేశాల పట్ల ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, శకుంతల, రమాదేవి, జమున మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వానికి అధికారం రెండు నెలలే ఉండగా 6 నెలల ఆదేశాలను ఎలా ఇచ్చారని ఎద్దేవాచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్‌వాడీ డిమాండ్లు పరిష్కరించడం మినహా మరొక మార్గం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో దీక్షా శిబిరం నుంచి వెళుతున్న గవర్నర్‌ కాన్వారు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. జగన్‌ ప్రభుత్వానికి తమ బాధలు వినిపించేందుకు జోక్యం చేసుకోవాలని నినాదాలు చేశారు. అక్రమంగా తీసుకొచ్చిన జీవో 2 ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలన్నారు. ఈ 24 గంటల దీక్షలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.నాగమణి, అంగన్‌వాడీ కార్మికుల యూనియన్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శకుంతల, రమాదేవి, కోశాధికారి జమున, తిప్పిరమ్మ, నాగేశ్వరమ్మ, రామాంజనమ్మ, మేరీ, పి.లక్ష్మి, పంకజి తదితరులు దీక్షలు చేపట్టారు. వీరికి మద్దతుగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మన్నిల రామాంజనేయులు, ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్యామల, రాజేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షురాలు రామాంజనమ్మ, భాగ్యమ్మ, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.బాలరంగయ్య, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి ముస్కిన్‌, ఎమ్మార్పిఎస్‌ నాయకులు కేపీ.మధు, తదితరులు మద్దతుగా మాట్లాడారు. ఈసందర్భంగా అంగన్వాడీలు దీక్ష శిబిరంలోనే శనివారం రాత్రి నిద్రించారు. ఎస్మాను ఖండించిన ప్రజా కార్మిక రైతు సంఘాలుఅంగన్‌వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని కార్మిక, ప్రజా, రైతు, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. హక్కులు అమలు చేయమంటే ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమైన చర్య అని ఆయా సంఘాల నాయకులు అన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.బాల రంగయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.క్రిష్ణమూర్తి, ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ముత్తుజా, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి ముస్కిన్‌, సిపిఎం నగర కార్యదర్శులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్‌, భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి రామాంజినేయులు తదితరులు ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు.

➡️