మోడీని గద్దె దింపితేనే రైతాంగానికి రక్ష

అనంతపురంలో ర్యాలీ చేస్తున్న అఖిల భారత రైతు కార్మిక సంఘాల నాయకులు

        అనంతపురం కలెక్టరేట్‌ : అన్నదాతలను విస్మరించి కార్పొరేట్‌ పాలన సాగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఆయనకు వంత పాడుతున్న పార్టీలను గద్దె దింపితేనే రైతులకు రక్షణ లభిస్తుందని అఖిలభారత రైతు, కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. రైతాంగం చేపట్టిన చలో ఢిల్లీకి మద్దతు తెలియజేస్తూ కార్మిక, రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక, రైతుకూలీ సంఘాల ఆధ్వర్యంలో అనంతపురంలో గురువారం ఉదయం నిరసన ర్యాలీ చేపట్టారు. లలిత కళాపరిషత్‌ నుంచి టవర్‌ క్లాక్‌ వరకు ర్యాలీ కొనసాగింది. టవర్‌క్లాక్‌ వద్ద బైటాయించి రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్ర కుమార్‌, రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, చంద్రశేఖర్‌ రెడ్డి, చెన్నప్ప యాదవ్‌, కౌలు రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరంగయ్య, ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు ఏసురత్నం, ఆంధ్రప్రదేశ్‌ రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షులు కిష్టా, రాయుడు, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ తదితరులు మాట్లాడుతూ బిజెపిని అధికారంలోకి తీసుకుని వస్తే రైతుల పంటలకు కనీస మద్దతు ధర చట్టం తెస్తామని 2014కు ముందు నరేంద్ర మోడీ హామీనిచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. ఇదే డిమాండ్‌ మీద రైతులు సంవత్సరాల తరబడి పోరాడుతుంటే మోడీ రైతులను దేశద్రోహులు, కలికిస్తాన్‌ ఉగ్రవాదులంటూ అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్ల కాలంలో 1.60 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే అన్నదాతల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఓ వైపు రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే కార్పొరేట్ల ఆస్తులు మాత్రం వేలరెట్లు పెరిగి ప్రపంచ కుబేరులుగా మారుతున్నారన్నారని తెలియజేశారు. రైతులపై మోడీ అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను అడ్డుకోవాల్సిన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోడీ భజన చేయడం సిగ్గుచేటన్నారు. మోడీకి వంతపాడుతున్న ఇలాంటి పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్వామినాథన్‌ సిఫార్సుల మేరకు పంటలకు కనీసం మద్దతుధర చట్టం చేయాలన్నారు. ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలన్నారు. ఉపాధిహామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా పంట రుణాలు, వంట నష్టం, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. కేరళ ప్రభుత్వం తరహా రైతుల పంటలకు రుణ ఉపశమన చట్టం చేయాలన్నారు. రైతాంగ ఉద్యమం సందర్భంగా చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎటిఎం నాగరాజు, తిరుమలేష్‌, భగత్‌ సింగ్‌ ఆటోవర్కర్స్‌ యూనియన్‌ ఆదినారాయణ, శివప్రసాద్‌, లక్ష్మీనారాయణ, రైతుసంఘం నాయకులు చెన్నారెడ్డి పాల్గొన్నారు.

➡️