రాయదుర్గంలో రాజకీయ కాక..!

ఒకరిపై ఒకరు వేలి చూపించకుంటూ విమర్శలు చేసుకుంటున్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఛైర్‌పర్సన్‌ పొరాలు శిల్ప

      రాయదుర్గం : రాయదుర్గం రాజకీయాలు వేడిక్కుతున్నాయి. అధికార పార్టీలో పరిస్థితి రోజుకోమలుపు తిరుగుతోంది. అధిష్టానం సమన్వయ కర్తను మార్చిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటి వరకు కాపు రామచంద్రారెడ్డి వెంట నడిచిన వారే ఆయన్ను నిలదీసే పరిస్థితి వచ్చింది. తాజాగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా ఛైర్‌పర్సన్‌ పొరాలు శిల్ప, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు వేలు చూపించుకుంటూ వాదోపవాదాలు చేసుకున్నారు. ఈ ఘటనతో మున్సిపల్‌ సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. రాయదుర్గం పురపాలక సంఘం పాలకమండలి సమావేశం బుధవారం ఉదయం అధ్యక్షురాలు పొరాలు శిల్ప అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా హాజరయ్యారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే, ఛైర్‌పర్సన్‌ మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే అవి ఎప్పుడూ బహిర్గతం కాలేదు. బుధవారం జరిగిన సమావేశంలో అవి బహిర్గతం అయ్యాయి. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాట్లాడుతుండగా ఛైర్‌పర్సన్‌ శిల్ప అడ్డుతగిలారు. తాను మాట్లాడేప్పుడు అడ్డురావద్దని ఊరికే ఉండాలని ఎమ్మెల్యే ఆమె వైపు వేలెత్తి చూపించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. గతంలో రామచంద్రారెడ్డి సిఫార్సు మేరకే శిల్ప ఛైర్‌పర్సన్‌ స్థానాన్ని చేపట్టారు. తరువాత మున్సిపాల్టీలో ఆమె మాట చెల్లుబాటు కాకపోవడంతో తీవ్ర అసంతప్తికి లోనైంది. ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ మధ్య రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రతి పనికీ ఒక వర్గం మరో వర్గం అడ్డుకోవడం పరిపాటిగా మారింది. దీంతో మున్సిపాల్టీలో అభివద్ధి కుంటుబడుతూ వచ్చింది. ఈ క్రమంలో రాయదుర్గం వైసిపి సమన్వయకర్త మార్పు అంశం విభేదాలను మరింత తారాస్థాయికి చేర్చింది. ఏకంగా ఛైర్‌పర్సన్‌ ఎమ్మెల్యేను నిలదీసి ప్రశ్నించారు. జీరో అవర్‌లో సభ్యులు తాగునీటి ఎద్దడి, జాతీయ రహదారి పక్కన సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున మార్కింగ్‌ అయ్యాక శ్మశానవాటిక ప్రహరీ పనులు చేపట్టాలని కోరారు. అక్రమ లేఔట్లపై చర్యలు తీసుకోవాలని, అందాక రిజిస్ట్రేషన్లు ఆపాలని ఎమ్మెల్యే కోరారు. పాలక మండలిలో రెండు వర్గాలు ఉన్నాయని, అలాంటప్పుడు ఎలా కలిసి పనులు చేస్తారని కొందరు సభ్యులు ఆరోపించారు. ఇందుకు ఛైర్‌పర్సన్‌ సమాధానం ఇస్తూ తాము ఎలాంటి వర్గాలు ఏర్పాటు చేయలేదని, చేసే పనులను కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నట్లు ఆరోపించారు. ఇలా సమావేశం జరుగుతున్నంత సేపూ ఒకరిపై ఒకరు వాదనలు చేసుకున్నారు.

సొంత నిధులతో అభివృద్ధి చేశా

ప్రభుత్వ విప్‌ కాపు

        కోట్ల రూపాయల సొంత నిధులతో రాయదుర్గం పట్టణాన్ని అభివృద్ధి చేశానని, ఎన్నికల తర్వాత కూడా పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి సిఎం జగన్‌ జేబు నుంచి నిధులు ఇవ్వడం లేదని, అవి రాష్ట్ర ప్రభుత్వ నిధులే అన్నారు. నియోజకవర్గంలో తాను చేస్తున్న సేవలను ఓర్వలేని కొందరు తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు తనను ఎప్పుడైనా కలవొచ్చన్నారు. అనివార్య పరిస్థితుల వల్ల తాను వైసిపికి దూరం కావాల్సి వచ్చిందన్నారు.

కాపుపై వైసిపి నేతల ఫైర్‌

           రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డిపై వైసిపి నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం రాయదుర్గంలోని వైసిపి సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య, నియోజకవర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు వీరాంజనేయులు మాట్లాడారు. కాపు రామచంద్రారెడ్డి బుధవారం నాడు రాయదుర్గం మున్సిపల్‌ కార్యాలయంలో వ్యవహరించిన తీరు సరికాదన్నారు. కాపు నెలరోజుల క్రితం జగన్‌మోహన్‌రెడ్డిని దేవుడు అంటూ పొగిడి ఇప్పుడు ఆయన్ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఆయనకు టికెట్‌ రాకపోయే సరికి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు రామచంద్రారెడ్డికి రాజకీయ గుర్తింపును ఇచ్చింది వైఎస్‌ఆర్‌ కుటుంబం అన్న విషయాన్ని ఆయన గుర్తించుకోవాలన్నారు. కాపు తాటాకుచపళ్లకు భయపడేవారు వైసిపిలో ఎవరూ లేదన్నారు. విలేకరుల సమావేశంలో రాయదుర్గం పురపాలక సంఘం అధ్యక్షులు పోరాలు శిల్ప, మాజీ అధ్యక్షులు గౌని ఉపేంద్ర రెడ్డి, పార్టీ పట్టణ కన్వీనర్‌ శివప్ప, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ వలి భాషా పాల్గొన్నారు.

➡️