రూ.5.50 లక్షలు విలువజేసే ఆర్మీ మద్యం పట్టివేత

స్వాధీనం చేసుకున్న ఆర్మీ మద్యాన్ని చూపుతున్న సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ

           అనంతపురం : అనంతపురం జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో ఆర్మీ మద్యం పట్టుబడింది. ఆర్మీ క్యాంటీన్‌ నుంచి మద్యాన్ని తీసుకుని వచ్చి అక్రమంగా అదనపు డబ్బు కోసం విక్రయిస్తున్న మాజీ బిఎస్‌ఎఫ్‌ జవాన్‌ను అరెస్టు చేశారు. ఈయన నుంచి రూ.5.50 లక్షల విలువజేసే ఆర్మీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ జి.రామకృష్ణ సోమవారం నాడు విలేకరులకు వెల్లడించారు. నార్పల మండలం తుంపెర గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి బిఎస్‌ఎఫ్‌లో జవానుగా పని చేసి రిటైర్‌ అయ్యారు. ఈయన అనంతపురం శిల్ప లేపాక్షి నగర్‌్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. బెంగుళూరులోని ఆర్మీ క్యాంటీన్‌లో తను, తన సహచర రిటైర్డ్‌ జవాన్ల ద్వారా మద్యాన్ని కొనుగోలు చేసి వాటిని అనంతపురం తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయించేవాడు. ఒక్కో బాటిల్‌పై సుమారు రూ.250 దాకా అధికంగా విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఈ క్రమంలో అర్మీ అక్రమ మద్యం వ్యాపారంపై ఎస్పీ కెకెఎన్‌.అన్బురాజన్‌కు సమాచారం అందడంతో ఆయన సెబ్‌ అధికారులకు తెలియజేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు సెబ్‌ అదనపు ఎస్పీ జి.రామకష్ణ పర్యవేక్షణలోఅనంతపురం సెబ్‌ స్టేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్స్‌పెక్టర్‌ వి.యల్లయ్య ఆధ్వర్యంలో సోమవారం నాడు అనంతపురంలోని హనుమంతరెడ్డి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 303(750ఎంఎల్‌) డిఫెన్స్‌ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.5.50 లక్షలు ఉంటుందని సెబ్‌ పోలీసులు తెలియజేశారు. వీటిని విక్రయిస్తున్న హనుమంతరెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సెబ్‌ అదనపు ఎస్పీ రామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెబ్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు వెంకట నారాయణ, సతీష్‌, కానిస్టేబుళ్లు నారాయణస్వామి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.

హమాలీ కాలనీలో ఆర్మీ, ఫారిన్‌ మద్యం పట్టివేత

         అనంతపురం నగరంలోని హమాలీకాలనీలో ఫారిన్‌, ఆర్మీ మద్యం బాటిళ్లను పోలీసుల స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… హమాలీకాలనీలో నివాసం ఉంటున్న భరత్‌ రెడ్డి మాజీ సైనికోద్యోగుల కార్డులను సేకరించి బెంగుళూరులోని ఆర్మీ క్యాంటీన్‌ మద్యం బాటిళ్లు కొనుగోలు చేస్తున్నాడు. వాటిని అనంతపురం తీసుకుని వచ్చి అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేవాడు. ఫారిన్‌ బ్రాండ్ల మద్యాన్ని కూడా బెంగుళూరులో అనంతకు తీసుకుని వచ్చి విక్రయించేవాడు. ఈ అక్రమ మద్యంపై పక్కా సమాచారం అందడంతో ఎస్పీ కెకెఎన్‌.అన్బురాజన్‌ ఆదేశాల మేరకు రెండవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సిఐ క్రాంతికుమార్‌, ఎస్‌ఐలు రుష్యేంద్ర బాబు, సలామ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో సోమవారం నాడు హమాలీకాలనీలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆర్మీ, విదేశాలకు చెందిన 39 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకన్నారు. వీటిని విక్రయిస్తున్న భరత్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

➡️