రైతులను అన్నివిధాలుగా ఆదుకోవాలి

వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-శింగనమల

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తహశీల్దార్‌ ఈశ్వరమ్మ, ఎంపిడిఒ నిర్మలాకుమారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు సాగు చేసిన రైతులతోపాటు వాస్తవంగా సాగులో ఉన్న కౌలు రైతులకు కూడా పరిహారం చెల్లించాలన్నారు. రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని, ఉపాధి హామీ కింద 200 రోజులు పని దినాలు కల్పించి రోజుకు రూ600 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంట నష్టపరిహారం అంచనాల కోసం తీసుకొచ్చిన జీవో.5ను ఉపసంహరించుకోవాలన్నారు. లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ జీవో ప్రకారం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన సమయంలో 33శాతంపైగా పంట నష్టం జరిగి ఉండాలన్నారు. అదికూడా గరిష్టంగా రెండు హెక్టార్లకు మాత్రమే పరిహార ఇవ్వాలనే నిబంధన ఉందన్నారు. అలాకాకుండా నష్టపోయిన ప్రతి పంటకూ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా పంట నష్ట పరిహారం ఇవ్వాలని, పంట సాగు చేసిన నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు, సాగు చేయని రైతులకు రూ.30వేలు ఇవ్వాలన్నారు. అలాగే పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుంకన్న, ఎర్రిస్వామి, ఆంజనేయులు, జయరాముడు, శ్రీనివాసులు, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️