విస్మరిస్తే పరకలతో ఊడ్చేస్తాం..

విస్మరిస్తే పరకలతో ఊడ్చేస్తాం..

రాయద్గుంలో సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌

మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తామని సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని ప్రతిపక్ష నేతగా వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన తరువాత విస్మరించారని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు, సిఐటియు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరుతూ మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులు మంగళవారం నాడు సమ్మెబాట పట్టారు. సమ్మె ప్రారంభం సందర్భంగా కార్మికులందరూ పనిముట్లతో టవర్‌క్లాక్‌ నుంచి కార్పొరేషన్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ బైటాయించి నిరసన తెలిపారు. మున్సిపల్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు బండారి స్వామి అధ్యక్షతన నిర్వహించిన సమ్మె ప్రారంభం కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ ఎన్నికల ముందు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మాట తప్పారు.. మడమా తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కార్మికులు ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే కార్మికుల అన్ని సమస్యలను తీరుస్తాన్న జగన్మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా వాటిని పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు. వేతనాల పెంపునకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి విలాసవంతమైన భవన నిర్మాణాలకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెరిగిన నగర జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యనూ పెంచామన్నారు. పెండింగ్‌లో ఉన్న డిఎలు ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. సిపిఎస్‌ రద్దును రద్దు చేసి ఓపిఎస్‌ అమలు చేయాలన్నారు. ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్‌ వేతనాలు అమలు చేయాలన్నారు. మున్సిపల్‌ పారిశుధ్య యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు ఎటిఎం.నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడంలో ముఖ్యమంత్రి కావాలనే తాత్సారం చేస్తున్నారన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ. కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గురురాజా, వెంకటనారాయణ, ముత్తాజ, ఇంజినీరింగ్‌ విభాగం జిల్లా నాయకులు మల్లికార్జున, సంజీవరాయుడు, నగర అధ్యక్ష, కార్యదర్శులు బండారి ఎర్రిస్వామి, తిరుమలేశు, మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి ఆదినారాయణ ఎమ్మార్పీఎస్‌ అనుబంధ నాయకులు నల్లప్ప, భగత్‌ సింగ్‌ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ నాయకులు ఆది, ఆజాం మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ గౌస్‌ మోదిన్‌ సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ విభాగం నగర అధ్యక్ష, కార్యదర్శులు ఓబులపతి, పోతులయ్య, మహిళా నాయకులు వరలక్ష్మీ, లక్ష్మీనరసమ్మ కాంతమ్మ, లక్ష్మీదేవి, సర్దానమ్మ, ఇమాంబి, రవి ప్రభాకర్‌, శేషాంద్ర కుమార్‌ పాల్గొన్నారు. రాయదుర్గం : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, పారిశుధ్య కార్మికులకు సిఎం జగన్‌ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు మంగళవారం సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా కార్మికులు స్థానిక వినాయక కూడలి నుంచి పాత మున్సిపల్‌ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న సిఎం జగన్‌ తాము అధికారంలోకి వస్తే మున్సిపల్‌ కార్మికులకు ఆరు నెలల్లోనే కాంటాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వీటితోపాటు అనేక హామీలు ఇచ్చారన్నారు. వాటిలో ఒక్కటీ అమలు చేసిన పాపానపోలేదన్నారు. ఇప్పటికైనా సిఎం జగన్‌ స్పందించి మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌, సెమీస్కిల్ట్‌ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, రిస్క్‌ అలవెన్స్‌, హెల్త్‌ అలవెన్స్‌ మంజూరు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని, కార్మికులకు ఇల్లు, ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు సిపిఎం సీనియర్‌ నాయకులు ఎన్‌.నాగరాజు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు తిప్పేస్వామి, మల్లేష్‌ రాము, తిప్పేరుద్ర, శీన, నరసింహులు, ఆదిలక్ష్మి సిద్ధ, పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️