శింగనమల వైసిపిలో ఆగని ఇంటిపోరు..!

           నార్పల : శింగనమల వైసిపిలో అసంతృప్తి జ్వాలలు తగ్గడం లేదు. సమన్వయకర్త మార్పు కోరుతూ ఆ పార్టీ నేతలు నిరసన గళాన్ని విన్పిస్తూనే ఉన్నారు. అభ్యర్థిని మార్చకపోతే భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామంటూ వైసిపి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం అనంతపురం గుత్తి రోడ్డులోని బల్లా కన్వెన్షన్‌ హాల్‌లో శింగనమల నియోజకవర్గ వైసీపీ అసమ్మతి నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు. బహిరంగంగానే వీరు తమ అసమ్మతి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇప్పటికే పలుసార్లు వీరు సమావేశాలు నిర్వహించి అభ్యర్థిని మార్చాలని కోరారు. అయినా అధిష్టానం మాట వినకపోవడంతో ఈ సారి పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత శింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులుకు ఎటువంటి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేదే లేదంటూ వారంతా నేడు జరిగే సమావేశంలో బహిరంగ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి నాయకత్వంలో వీరాంజినేయులను గెలిపించాలని కోరుతూ నియోజకవర్గంలో వైసిపి ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంలో కొందరు పాల్గొంటుండగా మెజార్టీ వైసిపి నాయకులు మాత్రం పాల్గొనడం లేదు. వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు ఇంత బహిర్గతంగా జరుగుతున్నా అధిష్టానం మౌనంగా ఉండడం అసమ్మతి నేతలను మరింత అసహనానికి లోను చేస్తోంది. అభ్యర్థి ఎవరైనా ఓటర్లు కేవలం జగన్మోహన్‌ రెడ్డి బొమ్మను చూసి ఓటు వేస్తారన్న అతినమ్మకంలో అధిష్టానం ఉందన్న, ఇది సరికాదనే అసమ్మతి నేతల వాదన. స్థానిక నాయత్వం మాట వినకుండా అతినమ్మకం సరికాదంటున్నారు. నేడు నిర్వహించే అసమ్మతి నేతల సమావేశంలో శింగనమల వైసిపి పరిస్థితిపై పూర్తి స్థాయిలో అధిష్టానానికి తెలియజేసేలా సమావేశం నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల్లో వైసిపి ముఖ్య నాయకులు శింగనమలలో నెలకొన్న అంసతృప్తిపై ఎలా స్పందించారో వేచి చూడాల్సి ఉంది. టిడిపికి కలిసొచ్చే అవకాశం..! వైసిపిలో నెలకొన్న అసంతృప్తి వచ్చే ఎన్నికల్లో టిడిపికి కలిసొచ్చే అవకాశం ఉందని అధికార పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. ఇప్పటికే టిడిపి అభ్యర్థిగా బండారు శ్రావణిశ్రీని ప్రకటించింది. ఆమె ప్రచారాన్ని సైతం విస్కృతంగా చేస్తున్నారు. బండారు శ్రావణిశ్రీని అభ్యర్థిగా ప్రకటించగానే ఆ పార్టీలో సైతం కొందరు ముఖ్య నాయకులు తమ అసంతృప్తిని బహిర్గతం చేశారు. దీనిపై స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్‌ స్పందించి అసంతృప్తి నేతలతో మాట్లాడారు. గెలుపు కోసం పని చేయాలని వారికి సూచించి అందరినీ కలిపారు. దీంతో టిడిపి నాయకులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రచారాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసిపిలో నెలకొన్న అసమ్మతి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ పార్టీ మద్దతుదారులు తెలియజేస్తున్నారు.

➡️