స్మార్ట్‌మీటర్లపై రైతుల ఆగ్రహం

స్మార్ట్‌ మీటర్లను తొలగిస్తున్న రైతులు

         పామిడి : మండలంలో వ్యవసాయ బోరుబావులకు స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేయడంపై రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో విద్యుత్‌ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన దాదాపు 35 స్మార్ట్‌ మీటర్లను రైతులు తొలగించేశారు. రైతులపై భారం వేసేలా దొడ్డిదారిన తెస్తున్న స్మార్ట్‌మీటర్లు వద్దేవద్దంటూ అధికారులకు తెగేసి చెప్పారు. గురువారం ఉదయం పామిడి మండలం ఎదురూరు, అక్కజాంపల్లి గ్రామాల్లో బోరుబావులకు విద్యుత్‌ అధికారులు స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేశారు. రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులు దీనిని అడ్డుకుని అధికారులు ఏర్పాటు చేసిన స్మార్ట్‌మీటర్లను తొలగించారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల కార్యదర్శి ముత్యాలు, మల్లేష్‌ మాట్లాడుతూ ఆదానీ సంస్థకు రూ.68 వేల కోట్ల కాంట్రాక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేస్తోందన్నారు. అంబానీ, ఆదానీ లాంటి కార్పొరేట్ల కోసం రైతులపై భారాలు మోపడం సిగ్గుచేటన్నారు. స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు అయితే ముందస్తుగా డబ్బు చెల్లిస్తేనే కరెంటు వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. దీనిని అడ్డుకోవాల్సిన ప్రభుత్వం డబ్బును తామే చెల్లిస్తామని చెప్పి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వ్యవసాయ బోరుబావులకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసే చర్యలను తక్షణం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ కాదని ఏర్పాటు చేస్తే రైతులతో కలిసి వాటిని తొలగించేస్తామని స్పష్టం చేశారు.

➡️