3న పల్స్‌ పోలియో

పల్స్‌ పోలియో కార్యక్రమానికి పోస్టర్లను విడుదల చేస్తున్న అధికారులు

         అనంతపురం కలెక్టరేట్‌ : మార్చి 3వ తేదీన జిల్లా వ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలియజేశారు. కలెక్టరేట్‌ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నాడు పల్స్‌ పోలియో ఇమ్యునైజేషన్‌ – ఎన్‌ఐడి 2024కి సంబంధించి జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ సమావేశాన్ని నిర్వహించారు. పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన పోస్టర్లను నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘస్వరూప్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్‌ మాట్లాడుతూ ఐదేళ్ల వయస్సు వరకు గల ప్రతి చిన్నారికి ప్రతిసారి పోలియో మోతాదు ఇవ్వాలన్నారు. పిల్లలకు రక్షణ కల్పించడంలో ఎలాంటి తప్పులూ చేయరాదన్నారు. జిల్లా ఇమ్మునైజెషన్‌ అధికారి డా||యుగంధర్‌ మాట్లాడుతూ మార్చి 3వతేదీ నుంచి 5వ తేదీ వరకు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 0-5 ఏళ్ల లోపు 2,79,980 మంది చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో 32 మండలాల పరిధిలో 3.80 లక్షల డోస్‌ల పోలియో వ్యాక్సిన్‌ను సరఫరా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఎపిసి వరప్రసాద్‌, ఐసిడిఎస్‌ పీడీ శ్రీదేవి, డిసిహెచ్‌ఎస్‌ డా||పాల్‌ రవికుమార్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ డా||సుజాత, డిప్యూటీ హెచ్‌ఈవో గంగాధర్‌ పాల్గొన్నారు.

➡️