ప్రశాంతంగా ఉత్సవాలు చేసుకోవాలి

ప్రశాంతంగా ఉత్సవాలు చేసుకోవాలి

వేల్పుమడుగు గ్రామస్తులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

ప్రజాశక్తి-వజ్రకరూరు

సాధారణ ఎన్నికలు ముగిసేంత వరకూ శాంతిభద్రతలను కాపాడాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వినోద్‌కుమార్‌ సూచించారు. బుధవారం విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామంలో పర్యటించి జాతర నిర్వహణపై సుంకులమ్మ ఆలయంలో గ్రామ ప్రజలు, పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల సమయంలో 22 ఆలయాల్లో జాతరలు జరగనున్నాయన్నారు. ఆయా ఆలయాలకు ఆర్‌డిఒలు, తహశీల్దార్లు వెళ్లి గ్రామస్తులు, పెద్దలతో మాట్లాడుతున్నారన్నారు. అదేవిధంగానే వేల్పుమడుగులో సుంకులమ్మ జాతరను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. గ్రామంలో జాతరను పెద్దగా జరుపుకోవాలని ఆలోచన ఉంటుందని, అయితే ఎన్నికల పరిమితులను కాపాడాలన్నారు. జాతరను ఎన్నికల కౌంటింగ్‌ అనంతరం జరుపుకునేందుకు మార్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఒక భక్తుడిలా జాతరలో పాల్గొనాలని, ఎవరూ గొడవలకు పాల్పడరాదన్నారు. ఇందుకు అందరి సహకారం అందించాలన్నారు. ఎన్నికలంటే ఎవరో ఒకరు గెలుస్తారని, ఫలితాలను అందరూ స్వాగతించాలన్నారు. ఇందులో భాగంగా గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి..ఆలయంలో ఎన్నిసార్లు పూజలు చేస్తారు, తదితర వివరాలపై ఆరాతీశారు. అంతకుముందు సుంకులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

➡️