‘సంక్షేమం’ కొనసాగాలంటే జగనే రావాలి

'సంక్షేమం' కొనసాగాలంటే జగనే రావాలి

ప్రచారంలో పాల్గొన్న అనంత వెంకటరామిరెడ్డి, శంకరనారాయణ

ప్రజాశక్తి-అనంతపురం

ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందాలంటే జగన్‌ మరోసారి సిఎం కావాలని వైసిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శంకరనారాయణ, అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గురువారం అనంతపురం రూరల్‌ పరిధిలోని రుద్రంపేట బైపాస్‌తోపాటు పలు కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో వైసిపికి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిఎం జగన్‌ సచివాలయాలు, వాలంటీర్లను తీసుకొచ్చి ఇంటింటికీ నేరుగా సంక్షేమ పథకాలను చేరవేస్తున్నారన్నారు. ఆయా పథకాలు కొనసాగాలంటే జగన్‌ మరోసారి సిఎం కావాలన్నారు. ఒకవేళ టిడిపికి ఓటు వేస్తే ఇప్పుడు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోతాయని హెచ్చరించారు. కావున వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా అనంత వెంకటరామిరెడ్డిని ఆశీర్వదించి జగన్‌ను మరోసారి సిఎంను చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం మాయమాటలు చెబుతున్న చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మొద్దన్నారు. టిడిపి నాయకులు ఎన్నికల్లో తప్ప మిగతా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండరన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తారన్నారు. కరోనా సమయంలో ఒక్క టిడిపి నాయకుడు అయినా ప్రజల వద్ద కనిపించాడా.. అని ప్రశ్నించారు. కావున ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వైసిపి నాయకులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️