‘ల్యాండ్‌ టైట్లింగ్‌’పై దుష్ప్రచారం : విశ్వ

'ల్యాండ్‌ టైట్లింగ్‌'పై దుష్ప్రచారం : విశ్వ

ప్రచారంలో మాట్లాడుతున్న వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి

ప్రజాశక్తి-వజ్రకరూరు

సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలనే కుయుక్తులు, కుట్రలతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టిడిపి అధినేత నారా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వజ్రకరూరు మండలంలోని తట్రకల్లు, గంజికుంట, వజ్రకరూరు, బోడిసానిపల్లి, బోడిసానిపల్లి తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌పై టిడిపి నేతలు దుష్ప్రచారం చేసి ఓట్లు కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ యాక్ట్‌పై గతంలో జరిగిన శాసనసభ సమావేశాల్లో స్వయానా టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మెచ్చుకున్న విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారా.. అంటూ ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో ఏనాడైనా ఒక్కసారైనా అసెంబ్లీలో ఇది తప్పు అని ప్రశ్నించారా అన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడడం సరైంది కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ భూముల పట్ల తీసుకున్న నిర్ణయాలతో చాలా మేలు జరుగుతుందన్నారు. భూ సమస్యలతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి సమయాన్ని వృథా చేసుకోకుండా ఈ యాక్ట్‌ ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. కాగా రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారం అందిచేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతులు ఇచ్చేలా సహకరించాలని కోరారు. తెలంగాణలో రైతులకు సంబంధించి నష్టపరిహారం అందించేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతులు ఇచ్చిందన్నారు. ఇక్కడ కూడా సహకరిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. కాగా మీకు మంచి జరిగి ఉంటేనే ఓట్లు వేయమని జగన్‌ అడుగుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం జగన్‌ను తిట్టి ఓట్లు అడుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ ఐదేళ్లపాటు నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోయి, ఇప్పుడు తిరుగుతూ ఓట్లు అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఐదేళ్లకు ఒకమారు ప్రజలకు కనిపించే కేశవ్‌కు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️