అందనంత దూరంలో ‘ఆహ్లాదం’

అందనంత దూరంలో 'ఆహ్లాదం'

గుత్తిలోని పార్కు

 

ప్రజాశక్తి-గుత్తి

ఉరుకులు.. పరుగుల జీవనంలో పట్టణ ప్రజలను కాసింత సేదతీర్చి, ఉల్లాసాన్ని ఇచ్చేవి పార్కులే… అలాంటి పార్కల అభివృద్ధి, నిర్వహణ బాధ్యత చేపట్టాల్సిన స్థానిక పురపాలక సంఘాలు తగిన శ్రద్ధ చూపటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుత్తి పట్టణంలో పార్కుల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. 15 ఏళ్ల కిందట ఉప్పరగేరిలో పురాతన బావి (కుక్కల బావి)ని పూడ్చివేసి అక్కడ పార్కు ఏర్పాటుకు పురపాలిక అధికారులు టెండర్ల ద్వారా గుత్తేదారుకు అప్పగించారు. తొలుత రూ.7లక్షలతో పనులు చేపట్టారు. తర్వాత రూ.5 లక్షల వెచ్చించి పనులు చేశారు. అయితే అరకొరగానే పనులు చేయటంతో పార్కు అసంపూర్తిగా నిలిచిపోయింది. పట్టణంలో పురపాలిక ఆధ్వర్యంలో ఒక్కపార్కు కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో ప్రజలు ఆహ్లాదానికి దూరమవుతున్నారు. స్థానిక అంబేడ్కర్‌ నగర్‌లో 35 ఏళ్ల కిందట రెండెకరాల్లో పార్కును ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారులు స్థలాన్ని సేకరించి ఉంచారు. ఆ స్థలంలో కొన్నేళ్ల తర్వాత ఇళ్లు వెలిశాయి. పట్టణంలో పార్కు ఏర్పాటుకు ఎంతో అనువుగా ఉన్న స్థలం కబ్జాకు గురైంది. తర్వాత రెవెన్యూ అధికారులే ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. దీంతో పార్కుల ఏర్పాటుకు పట్టణంలో అనువైన ప్రభుత్వ స్థలాలే లేవు. ప్రస్తుతం ఉప్పరగేరిలో పార్కు ఏర్పాటు పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. 15 ఏళ్ల కిందట కిందట చేపట్టిన పనులు నేటికీ పూర్తి కాలేదు. పార్కులో బెంచీలు, జిమ్‌, చిన్నపిల్లలు ఆడుకునేందుకు వీలుగా జారుడు బండ ఏర్పాటు చేశారు. ఇంకా పనులు చేయాల్సి ఉంది. ఐదేళ్ల క్రితం నేమితాబాద్‌ రోడ్డులో పది ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. రూ.1.20కోట్లు వెచ్చించాలని తీర్మానించారు. పనులు చేసేందుకు గుత్తేదారులు ముందు కు రావటం లేదని నెపంతో పను లు ప్రారంభం కాలేదు. పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో గుత్తి ఆర్‌.ఎస్‌లో అంబేద్కర్‌ పార్కు ఉంది. చిన్నదైన దీన్ని రైల్వే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. గుత్తిలో పార్కులు లేక చిన్నారులు, యువకులు, ప్రజలు ఆహ్లాదానికి దూరమవుతున్నారు. వారాంతాలు, సెలవుల్లో ఉద్యోగులు తమ పిల్లలతో కలిసి సేదతీరేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికైనా పురపాలక ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి పట్టణవాసులు సేద తీరేందుకు ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

➡️