‘రీటా నేర్పిన పాఠం’ పుస్తకావిష్కరణ

రీటా నేర్పిన పాఠం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న రచయితలు, ఐద్వా నాయకులు

          అనంతపురం కలెక్టరేట్‌ : సామాజిక స్పృహ, పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచిన ‘రీటా నేర్పిన పాఠం’ పుస్తకాన్ని శుక్రవారం నాడు అనంతపురం నగరంలోని ఎన్జీవో హోంలో విడుదల చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ పోరాట జీవిత విశేషాలు, సామాజిక కార్మిక వర్గం చైతన్యం, హక్కుల కోసం చేసిన సేవలు, పెట్టుబడిదారులు, మతతత్వ వాదులు నుంచి ఎదురైన ఇబ్బందులు, నాడు- నేడు కార్మిక వర్గం స్థితిగతులను తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రచయత ఆర్‌.శశికళ, డాక్టర్‌ పి.ప్రసూన ముఖ్య వక్తలుగా హాజరై ‘రీటా నేర్పిన పాఠం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గం నేడు పొందుతున్న హక్కులు, సౌకర్యాలు నాడు ఎందరో మహనీయులు పోరాటాలతో సాధించుకున్నవే అన్నారు. అలాంటి పోరాటాల్లో బృందాకరత్‌ నాయకత్వం వహించి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. టెక్స్‌టైల్స్‌ మిల్లు కార్మికులు పడిన కష్టాలు, ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు పుస్తకంలో పొందుపరిచారని తెలిపారు. సామాన్య కార్మికులను సంఘటితం చేసి వారిలో నాయకత్వాన్ని పెంపొందించిన తీరు అద్భుతంగా ఉందన్నారు. ట్రేడ్‌ యూనియన్‌లలో కార్మికులను భాగస్వామ్యులను చేసి హక్కుల సాధన కోసం చేసిన పోరాటం ఆదర్శనీయం అన్నారు. అభివృద్ధి పేరుతో నాడు జరిగిన విధ్వంసాన్ని ఎదురించడం స్ఫూర్తిదాయకం అన్నారు. నాడు కార్మిక వర్గం, సమాజం ఎదుర్కొన్న సమస్యలు నేటికి ఎదురవుతూనే ఉన్నాయని తెలిపారు. జెవివి నాయకురాలు డాక్టర్‌ ప్రసూన మాట్లాడుతూ బృందాకరత్‌ ఉద్యమాల చరిత్రను చదవడం అవసరం అన్నారు. ఆమె చిన్నతనం నుంచే సమస్యలు ఎదుర్కొని మనోధైర్యంతో ముందు సాగిన తీరు ఆదర్శం అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి కమ్యూనిస్టు రాజకీయాలకు ఆకర్షితులై విద్యార్థి సంఘం నుంచి పోరాట జీవితాన్ని ఆరంభించారని తెలిపారు. కార్మిక సంఘం నాయకురాలిగా కార్మికులు పడిన కష్టాలను చలించి అప్పటి పాలకులకు వ్యతిరేకంగా సంఘటితమైన పోరాటాలు కొనసాగించారని గుర్తు చేశారు. ఎన్నో అవమానాలు, అవహేళనలు, ఇబ్బందులు ఎదురైన నమ్మిన సిద్ధాతం కోసం అలుపెరగని పోరాటం సాగించి బృందాకారత్‌ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి మాట్లాడుతూ బృందాకారత్‌ పోరాటాల్లో భాగంగా జిల్లాకు కూడా వచ్చారని గుర్తు చేశారు. దేశంలో మహిళలు, కార్మికులకు అన్యాయం జరిగినా వారి పక్షాన పోరాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్స్‌ సంస్థ భానుజ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు రామాంజినమ్మ, సామాజికవేత్త బోస్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకురాలు దేవేంద్రమ్మ, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమయ్య, జిల్లా గౌరవాధ్యక్షులు రమణయ్య, నాయకులు చిత్తప్ప, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు నాగమణి, యోగా కటకం క్రిష్ణవేణి, రచయితలు డాక్టర్‌ ప్రగతి, రియాజుద్దీన్‌, నానీల నాగేంద్ర, అధ్యాపకులు నగరూరు రసూల్‌, సిపిఎం నగర కార్యదర్శి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️