శింగనమలలో వైసిపిలో మారని అసమ్మతి స్వరం..!

నార్పలలో సమావేశం నిర్వహించిన వైసిపి అసమ్మతి దళిత, బిసి నాయకులు

         నార్పల : శింగనమల వైసిపిలో అసమ్మతి చిచ్చు తగ్గడం లేదు. అభ్యర్థిని మార్చాలని డిమాండ్‌ చేస్తూ గత నెల రోజులుగా అసమ్మతి నేతలు పార్టీ అధిష్టానంకు వివిధ రూపాల్లో విజ్ఞప్తులు చేస్తునే ఉన్నారు. తాజాగా ఈ అసమ్మతి గ్రూపులోని దళిత, బిసి నేతలు శుక్రవారం ఉదయం నార్పల మండల కేంద్రం సమీపంలోని వైసిపి సీనియర్‌ నాయకులు మిద్దె కుళ్లాయప్ప వ్యవసాయ క్షేత్రంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో మిద్దె కుళ్లాయప్పతో పాటు సామలూరు రాజగోపాల్‌, మాజీ మండల కన్వీనర్‌ పట్నం నాగేష్‌, బుక్కరాయసముద్రం ఎంపిపి భర్త బుల్లె నారాయణస్వామి, శింగనమల మాజీ జెడ్పీటీసీ తరిమిల రామకృష్ణతో పాటు దాదాపు 200 మంది పాల్గొన్నారు. శింగనమల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు విషయంలో అధిష్టానంతో వీరంతా ఇప్పటికే విభేదించి పలు రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. అభ్యర్థిని మార్చాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. తాజాగా జరిగిన సమావేశంలో అసమ్మతి నేతలు ఏకంగా పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా సమావేశంలో పలువురు అసమ్మతి నేతలు మాట్లాడుతూ దళిత నియోజకవర్గమైన శింగనమలలో అగ్రవర్ణాల ఆధిపత్యం ఎక్కువైందని ఆవేదన చెందారు. దళిత నాయకులకు అడుగడుగునా అన్యాయం, అవమానం జరుగుతోందన్నారు. దళితులు, బీసీల భుజాలపై అగ్రవర్ణ ఆధిపత్యం సవారీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగు రోజుల క్రితం సాక్షాత్తు వైసిపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి బస్సుయాత్ర సందర్భంగా జిల్లాకు విచ్చేస్తే కనీసం తమగోడును చెప్పుకుందామంటే కలిసే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. కేవలం అగ్రవర్ణాలకు చెందిన వారికే మాత్రమే జగన్మోహన్‌రెడ్డి కలిసే అవకాశం ఇచ్చారన్నారు. వైసిపిలో దళితులు, బీసీలకు ఏ మాత్రం విలువ లేదన్నారు. టిప్పర్‌ డ్రైవర్‌కు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చామంటు గొప్పలు చెప్పుకుంటున్నారే గానీ, ఆ టిప్పర్‌ డ్రైవర్‌ వెనుక ఏ నాయకుడు ఉన్నారో అందరికీ తెలుసన్నారు. ఇలాంటి పార్టీలో ఎక్కువ రోజులు కొనసాగి పరిస్థితులు లేవన్నారు. త్వరలో వైసిపికి మూకుమ్మడి రాజీనామా చేస్తామని సమావేశంలో అసమ్మతి నాయకులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రామాంజినేయులు. సూర్యనారాయణతో పాటు పుట్లూరు, యల్లనూరు, శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల మండలాలకు చెందిన వైసిపి అసమ్మతి నేతలు పాల్గొన్నారు.

➡️