జిల్లా రైతులను ఆదుకోండి

కేంద్రం కరువు బృందంకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందిస్తున్న రైతుసంఘం నాయకులు

        అనంతపురం కలెక్టరేట్‌ : తీవ్ర వర్షాభావంతో 2023-24 ఖరీఫ్‌, రబీలో పంట నష్టపోయిన అనంతపురం జిల్లా రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని ఎపి రైతుసంఘం నాయకులు కోరారు. జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర కరువు బృందం సభ్యులను గురువారం అనంతపురంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ 2023 ఖరీఫ్‌, రబీలో అతివృష్టి, అనావృష్టితో వేరుశనగ, పప్పుశనగ, మిరప, పత్తి, ఆముదం, జొన్న, కొర్ర, మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, మినుములు, పెసలు, సోయాబీన్‌, ఉద్దులు, ఉలవలు, తెల్ల కుసుమ తదితర పంటలన్నీ చేతికందకుండా పోయాయన్నారు. ఆయకట్టు కింద కింద సాగుచేసిన పంటలను కూడా రైతులు నష్టపోయారన్నారు. జిల్లాలో గత నాలుగు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అప్పుల భారాలు భరించలేక 2019లో 46 మంది, 2020లో 67 మంది, 2021లో 41 మంది, 2022లో 66 మంది, 2023లో 48 మంది రైతులు ఆత్యహత్యలు చేసుకున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువు మండలాలుగా ప్రకటించారే తప్పా ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు తక్షణం జిల్లాకు రూ.10వేల కోట్ల రూపాయలు ప్రత్యేక ఫ్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలన్నారు. రైతుల పంట రుణాలు, ప్రయివేటు అప్పులన్నింటినీ ఒకేసారి మాఫీ చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు స్కేలు ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా పంట నష్టపరిహారం కనీసం 10 ఎకరాల వరకు ఇవ్వాలని కోరారు. పెట్టుబడి సాయం కుటుంబం ఆధారంగా కాకుండా, ఎకరాల ఆధారంగా కనీసం ఎకరాకు 10 వేలు, 10 ఎకరాల వరకు ఇవ్వాలన్నారు. డ్రిఫ్‌, స్ప్రింక్లర్లపై జీఎస్టీ రద్దుచేసి, ధరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకూ 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలన్నారు. జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకూ సాగునీరు ఇవ్వాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు గ్రామ పంచనామా ఆధారంగా రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. అన్ని గ్రామాల్లో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేసి దాణా, మందులు 90 శాతం సబ్సిడితో ఇవ్వాలని కోరారు.

➡️