స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తాం : ఎస్పీ

కంబదూరు వద్ద అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టును తనిఖీ చేస్తున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌

          అనంతపురం : ఎన్నికలకు సంబంధించి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తాంమని ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఓటర్లకు తెలియజేశారు. శనివారం ఉదయం బుక్కరాయసముద్రం మండలం శిద్ధరాంపురం గ్రామంలో కేంద్ర సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ ఫ్లాగ్‌ మార్చ్‌లో ఎస్పీ పాల్గొని ప్రజల్లో భరోసా కల్పించారు. గొడవలు, అల్లర్లులేని హింసారహిత ఎన్నికలే తమ లక్ష్యమన్నారు. స్థానికంగా ఏవైనా సమస్యలుంటే తమ దష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. గొడవలు, అల్లర్లు జోలికెళ్లకుండా ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో ఆ పద్ధతి, విధి విధానాలను తహశీల్దార్‌ హనుమాన్‌ నాయక్‌ ద్వారా ప్రజలకు వివరింపజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్‌ డీఎస్పీ బివి.శివారెడ్డి, బిఎస్‌ఎఫ్‌ డీఎస్పీ ధర్మేంద్ర, బుక్కరాయసముద్రం సిఐ వెంకటేశులు పాల్గొన్నారు.

అంతర్‌రాష్ట్ర సరిహద్దుల తనిఖీ

           కంబదూరు వద్ద చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టును ఎస్పీ అమిత్‌ బర్దర్‌ పరిశీలించారు. ఎన్నికల వేళ కర్నాటక నుంచి మద్యం, డబ్బు, ఎన్నికల తాయిలాలు అక్రమంగా ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించార. కర్నాటక నుంచి వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీలు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ కంబదూరు పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్‌ రికార్డులను పరిశీలించి, పెండింగ్‌ కేసులపై సమీక్షించారు. సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ లు, పల్లెనిద్రలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, రూరల్‌ సిఐ నాగరాజు, కంబదూరు ఎస్‌ఐ ఆంజనేయులు పాల్గొన్నారు.

➡️