కార్మికుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు

కార్మికుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు

కార్మికుడు కొండన్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌

మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగ తగదని మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు అన్నారు. గురువారం అనారోగ్యంతో మృతిచెందిన అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు కొండన్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగానే కొండన్న మృతిచెందాడని ఆరోపించారు. గురువారం తెల్లవారుజామున తీవ్ర అనారోగ్యానికి గురైన కొండన్నకు సకాలంలో వైద్యం అంది ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఎంబిబిఎస్‌ చదివిన డాక్టర్‌ హెల్త్‌ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసినప్పుడు ఎంహెచ్‌ఒగా కార్మికులకు సకాలంలో వైద్యం అందించాలన్నారు. అయితే అందుకు భిన్నంగా ఎంహెచ్‌ఒ విష్ణుమూర్తి కార్మికులకు సకాలంలో వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. గతంలో ఎవరైనా కార్మికులు అనారోగ్యంతో మృతిచెందితే ఎంహెచ్‌ఒ స్వయానా మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, దహన సంస్కారాలకు డబ్బులు ఇచ్చి అండగా నిలబడేవారన్నారు. అయితే ఎంహెచ్‌ఓ విష్ణుమూర్తి మాత్రం కార్మికులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈయనకు ప్లాస్టిక్‌ కవర్లపై ఉన్నంత శ్రద్ధ కార్మికుల ఆరోగ్యంపై ఉండకపోవడం బాధాకరమన్నారు. ఈయన సొంతూరు తాడిపత్రి కావడంతో ఉదయం 7 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్తారన్నారు. అంతేగాకుండా తాడిపత్రిలో సొంత క్లినిక్‌ ఏర్పాటు చేసి కార్మికులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేగాకుండా ఎంహెచ్‌ఓ విష్ణుమూర్తి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ కార్మికులకు మెడికల్‌ చెకప్‌ చేయించకపోవడాన్ని చూస్తే కార్మికుల ఆరోగ్యంపై ఎంహెచ్‌ఒకు ఉన్న నిర్లక్ష్యం స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. ఈ విషయంపై అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌ మేఘస్వరూప్‌ జోక్యం చేసుకుని కార్మికుల ఆర్యోగ్యాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే ప్రధానంగా మున్సిపల్‌ కార్మికులకు ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ సంబంధించి కన్సల్టెంట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే అనారోగ్యంతో మృతిచెందిన కొండన్న కుటుంబానికి దహన సంస్కారాల నిమిత్తం రూ.15వేలు కేటాయించి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెగ్యులర్‌ ఉద్యోగ కార్మిక సంఘం నగర కార్యదర్శి ఎం.నల్లప్ప, నగర అధ్యక్ష, కార్యదర్శులు బండారి ఎర్రిస్వామి, సాకే తిరుమలేష్‌, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, ఆదినారాయణ, శశీంద్రకుమార్‌, మహిళా కన్వీనర్లు లక్ష్మీనరసమ్మ, మంత్రి వరలక్ష్మి, ఆరు సర్కిల్‌ నుంచి కమిటీ లీడర్లు, కార్మికులు పాల్గొన్నారు.

➡️