రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ కు సత్కారం

Apr 10,2024 17:17 #Annamayya district

ప్రజాశక్తి-పీలేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల సంఘం అధ్యక్షులు నల్లారి ద్వారకనాధ రెడ్డిని పీలేరు బార్ అసోసియేషన్ గౌరవ సత్కారాన్ని అందించింది. రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో మొదటిసారి పీలేరుకు వచ్చిన ఆయనను స్థానిక కోర్టు ఆవరణంలో పీలేరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బిసి పురుషోత్తం రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షతన ఆయన్ను ఘనంగా సన్మానించి, సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 71 ఏళ్ల బార్ కౌన్సిల్ చరిత్రలో మొదటిసారి జిల్లా కోర్టు న్యాయవాదికి బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి దక్కిందని, తన ఈ హోదాకు న్యాయవాదులందరి సహాయ, సహకారాలే కారణమని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక బార్ అసోసియేషన్ అందించిన వినతులను ఆయన స్వీకరించారు. ప్రధానంగా పీలేరు కోర్టు భవనాల నిర్మాణాలు, ఖాళీగా ఉన్న 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి భర్తీ గురించి న్యాయవాదులు ప్రస్తావించారు. అందుకు ఆయన స్పందిస్తూ ఈ విషయాన్ని రాష్ట్ర చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకువెళ్లి త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అలాగే ఆయన మాట్లాడుతూ మృతిచెందిన న్యాయవాదుల కుటుంబాలకు అందాల్సిన డెత్ కాంపెన్సేషన్ రూ.4 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారని, మెడిక్లైమ్ రూ. 30 నుంచి రూ.50 వేలకు పెంచారని తెలియజేశారు. పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్స్ త్వరగా అందేటట్లు సంబంధిత అధికారులతో కలిసి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పీలేరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బిసి పురుషోత్తం రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్, కార్యనిర్వాహక సభ్యులు తెనాలి రామ సుబ్రహ్మణ్యం, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఎండి రఫి అన్సారి, ఇతర సభ్యులు జి. శివకుమార్ రెడ్డి, వి. చిన్న రెడ్డేప్ప, జగన్మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, భవాని శంకర, జి. ఈశ్వర్ రెడ్డి, రాజేంద్ర బాబు, దొరస్వామి నాయుడు, నరసింహారెడ్డి, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.

➡️