పల్నాడు కలెక్టర్‌గా అరుణ్‌బాబు

Jul 2,2024 23:48

పల్నాడు నూతన కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు, ప్రమోషన్‌పై బదిలీ అయిన ఎ.శ్యామ్‌ప్రసాద్‌, జి.రాజకుమారి
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
పల్నాడు జిల్లా నూతన కలెక్టర్‌గా పి.అరుణ్‌బాబు నియమితులయ్యారు. శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌గా ఉన్న అరుణ్‌బాబు బదిలీపై పల్నాడు జిల్లాకు వస్తున్నారు. 2014 ఐఎఎస్‌ బ్యాచ్‌కు చెందిన అరుణ్‌బాబు ముక్కుసూటిగా వ్వవహరిస్తారనే పేరుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో గత ఎన్నికల్లో సమర్ధవంతంగా, వివాదాలేమీ లేకుండా పనిచేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో పల్నాడు జిల్లా కలెక్టరుగా గత మే నెలలో నియమితులైన శ్రీకేష్‌ లత్కర్‌బాలాజీరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంకా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లు బదిలీ అయ్యారు. గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌ బి.రాజకుమారి నంద్యాల కలెక్టరుగా నియమితులు కాగా పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాం ప్రసాద్‌ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. 2022 ఏప్రిల్‌ 4న గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టరుగా పనిచేసిన రాజకుమారి గత 27 నెలలుగా రెగ్యులర్‌ జాయింట్‌ కలెక్టరుగా ఉన్నారు. అంతకు ముందు ఆమె గ్రామ, వార్డు సచివాలయాల విభాగం జెసిగా పనిచేశారు. దాదాపు మూడేళ్లపాటు ఆమె గుంటూరులో పనిచేశారు. పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కూడా 2022 ఏప్రిల్‌ 4న నియమితులయ్యారు. దాదాపు 27 నెలల పాటు ఆయన పల్నాడు జిల్లాలో పనిచేశారు. గత మూడు నెలల కాలంలో జిల్లాలో ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారుల బదిలీలు పెద్ద ఎత్తున జరిగాయి. ఎన్నికలు పూర్తయిన తరువాత అప్పటి పల్నాడు జిల్లా కలెక్టల్‌ ఎల్‌.శివశంకర్‌ను మే 16న ఎన్నికల కమిషన్‌ బదిలీ చేసింది. దాదాపు 45 రోజుల పాటు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. తాజాగా ఆయనకు వైఎస్సార్‌ కడప జిల్లా కలెక్టరుగా పోస్టింగ్‌ ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తరువాత శాంతిభద్రతల వైఫల్యం, ప్రధాని సభలో అపశృతులకు బాధ్యతగా ఐజి పాల్‌రాజ్‌, అప్పటి పల్నాడు జిల్లా ఎస్‌పి రవిశంకర్‌రెడ్డిని బదిలీ చేశారు. రవిశంకర్‌రెడ్డి స్థానంలో పల్నాడు ఎస్‌పిగా నియమితులైన గరికపాటి బిందుమాధవ్‌ను ఎన్నికల పోలింగ్‌ రోజున, అనంతరం జరిగిన అల్లర్లకు బాధ్యులుగా ఎన్నికల కమిషన్‌ సస్పెండ్‌ చేసింది. ఇటీవల ఆయన సస్పెన్షన్‌ను ఎన్నికల కమిషన్‌ తొలగించినా ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఎన్నికలు పూర్తయిన తరువాత నూతన ప్రభుత్వం ఏర్పాటు నేపధ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఎస్‌.నాగలక్ష్మీని నియమించారు. వేణుగోపాలరెడ్డికి ఇంకా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు.

➡️