విచ్చలవిడిగా కోడి పందాలు కోట్లల్లో జూదం

Jan 17,2024 00:43

ప్రజాశక్తి – వేమూరు
సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు విచ్చలవిడిగా జరిగాయి. మండలంలోని వరాహపురంలో ఎంపీపీ ఎలమాటి మోహన్, వైసీపీ మండల కన్వీనర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు ఆధ్వర్యంలో, కొల్లూరు మండలం పెసర్లంక గ్రామంలో వైసిపి నాయకులు గోపి ఆధ్వర్యంలోనూ, భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలో మాజీ ఎంపీటీసీ న్యాయవాది సేరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ పందాలు కొనసాగాయి. మూడు రోజులపాటు సంక్రాంతి సంబరాల పేరుతో జరిగిన ఈ కోడిపందాల్లో రూ.కోట్ల డబ్బు చేతులు మారాయి. రూ.5వేల నుండి రూ.5లక్షల వరకు కోడిపందాల పోటీ జరిగింది. పోటీలకు నాలుగు రకాల బరులను సిద్ధం చేశారు. దీనితోపాటు మూడు ముక్కలాట, కాయ్‌ రాజా కాయ్, లోన బయట వంటి పేకాటలు కూడా కొనసాగటమే గాక పందెం బరుల వద్ద విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ పందాలను తిలకించటానికి బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మహిళలతో సహా సంక్రాంతి సంబరాల పేరుతో కోడిపందాలు గెలిపించడమే కాక పందాల్లో కూడా పాల్గొన్న దాఖలాలు ఉన్నాయి. మంత్రి డాక్టర్‌ మేరుగ నాగార్జునతో పాటు అనేక మంది నాయకులు కోడిపందాలను తిలకించిన వారిలో ఉన్నారు.

➡️