భట్టిప్రోలు పంచాయతీలో రూ 2.33కోట్ల అవినీతి

Mar 17,2024 00:42

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండల కేంద్రమైన భట్టిప్రోలు మేజర్‌ పంచాయతీలో గడచిన ఐదేళ్ల కాలంలో రూ.2.33కోట్ల అవినీతి జరిగిందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి తనుగుంట్ల సాయిబాబా ఆరోపించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019-2024 మధ్య కాలంలో పంచాయతీకి వివిధ రూపాల్లో అందిన ఆదాయ వనరులు వాటిలో చేసిన ఖర్చులు లెక్క చూస్తే ఇప్పటివరకు రూ.2.33కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. పంచాయతీకి ప్రతి ఏట ఇంటి పన్ను నిమిత్తం రూ.45లక్షలు, కులాయి పన్నుల నిమిత్తం రూ.12లక్షలు, ఆశీలు పాట ద్వారా రూ.4.5లక్షలు, షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా రూ.5లక్షలు, రిజిస్ట్రేషన్ సర్చార్జీలు రూపంలో రూ.5లక్షలు, లైసెన్స్ ఫీజులు రూ.2లక్షలు, చేపల పాటల ద్వారా రూ.3.5లక్షలు, చిల్లర జమలు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.77లక్షలు ఆదాయ వస్తుందని అన్నారు. ఇవి కాక 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.65లక్షలు కలిపి ఏడాదికి రూ.కోటి 42 లక్షలు పంచాయతీకి జమవుతుందని అన్నారు. ఈ ఆదాయంలో ఏడాదికి సిబ్బంది జీతాల రూపంలో రూ.37.82లక్షలు, కరెంటు బిల్లులకు రూ.9.24 లక్షలు, కార్యాలయానికి అవసరమైన సామాగ్రి కొనుగోళ్లకు రూ.14లక్షలు, ఇతర ఖర్చులు రూ.6.36లక్షలు, మార్కెట్ వెనక సిసి రహదారికి రూ.17లక్షల కలిపి మొత్తం రూ.85.32లక్షలు ఖర్చు అయ్యిందని అన్నారు. దీని ప్రకారం సంవత్సరానికి ఉండవలసిన నిల్వ రూ.56.67లక్షలు ఉండగా ఐదేళ్లలో రూ.2.83కోట్లు నిల్వ ఉండాల్సి ఉందన్నారు. దీనిలో రూ.1.63కోట్లు కాగా ఇంకా రూ.1.19కోట్లు ఖర్చు మిగిలి ఉందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా డ్రా చేసిన వాటిలో భాను ఎంటర్ప్రైజెస్ కింద రూ.12.58లక్షలు, గంగ ఎంటర్ప్రైజెస్ కింద రూ.2.39లక్షలు, శాన్వ ఎంటర్ప్రైజెస్ రూ.55.62లక్షలు, భానుతేజ ట్రేడర్స్ రూ.2.43లక్షలు, జెసిబి ఆయిల్ ఖర్చుల నిమిత్తం రూ.3 లక్షలు, కార్యాలయ నిర్వహణ పద్దుకు రూ.14.38లక్షలు, కార్యాలయ ఖర్చులకు రూ.23.12లక్షలు చొప్పున వినియోగించినట్లుగా ఎలాంటి బిల్లులు, ఓచర్లు లేకుండానే స్వాహా చేశారని ఆరోపించారు. ఐదేళ్ల కాలంలో రూ.2.33కోట్లు అవినీతి జరిగినట్లుగా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. వీటిలో రూ.3.14కోట్లకు ఆడిటర్ అభ్యంతరాల విలువ ఉందని, 427 అభ్యంతరాల సంఖ్య కింద నమోదైనట్లు చెప్పారు. 2019 నుండి 24 వరకు పంచాయతీలో జరిగిన రూ.2.33కోట్ల అవినీతిపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. దీనిపై రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారం చేపట్టిన అనంతరం ఎక్కడెక్కడ ఏమి జరిగిందో అన్న అవినీతి మొత్తాన్ని బయటికి తీస్తామని హెచ్చరించారు.

➡️