రూ.6వందలు కనీస వేతనం ఇవ్వాలి

May 26,2024 00:11

ప్రజాశక్తి – బాపట్ల
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో కూలీలకు పని ప్రదేశాల్లో ఫోటో తీసే విధానాన్ని రద్దుచేసి రూ.6వందలు దినసరి కూలి చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులతో కలిసి మండలంలోని వెదుళ్ళపల్లి, బేతపూడి గ్రామాల్లో ఉపాధి కూలీల పని ప్రదేశాల వద్దకు శనివారం వెళ్లి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉదయం 6 గంటలకు వెళ్ళిన కూలీలు 11గంటలకు వస్తున్నారని అన్నారు. పని ప్రదేశాల్లో ఫోటో తీసే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఎన్‌పిఐసి లింకు ద్వారా కులీల హాజరు వేయడం వల్ల పని ప్రదేశాల్లో సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఒక చోట పని చేస్తే మరోచోట హాజరు వేయవలసి వస్తుందన్నారు. దీని వల్ల కూలీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొన్ని సందర్భాల్లో నెట్ వర్క్ లేకపోవడం వల్ల కూలీలకు హాజరు నమోదు కావడం లేదని కూలీలు వాపోయారని అన్నారు. వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీలకు రూ.6వందలు కనీస వేతనం చెల్లించాలని కోరారు. రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని అన్నారు. గతంలో పలుగు, పారా, పని ప్రదేశానికి ప్రయాణ చార్జీలు ఇచ్చే వారని అన్నారు. వెంటనే వాటిని ఇవ్వాలని కోరారు. పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దినేష్ జాను, రత్నరాజు, శ్రీనివాసరెడ్డి, ప్రసాద్, సుశీల, శివాజీ పాల్గొన్నారు.

➡️