కౌలు రైతులకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

Jun 16,2024 23:31 ##Battiprolu #CPI #Farmer

ప్రజాశక్తి – బట్టిప్రోలు
రాష్ట్రంలో కౌలు రైతులకు ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు గొట్టుముక్కల బాలాజీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో అధిక శాతం కౌలు రైతులే వ్యవసాయ ఉత్పత్తులను సాధిస్తున్నారని అన్నారు. అలాంటి వారికి రైతులతో సంబంధం లేకుండా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి తద్వారా గుర్తింపు కార్డులు, రుణాలు, ప్రభుత్వ రాయితీలు, వ్యవసాయ పరికరాలు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించేందుకు విజయవాడలోని సిపిఐ కార్యాలయంలో ఈ నెల 17న సదస్సు జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సుకు వేమూరు, రేపల్లె నియోజకవర్గాల కౌలు రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ సదస్సుకు కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి ఈశ్వరయ్య, కెవివి ప్రసాద్ హాజరవుతారని తెలిపారు. సమావేశంలో సిపిఐ నాయకులు బండారు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️