మంత్రి ‘అనగాని’కి ఘన స్వాగతం

ప్రజాశక్తి – రేపల్లె
రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొట్ట మొదటిసారి పట్టణానికి విచ్చేసిన ‘అనగాని సత్యప్రసాద్’కు జనసేన, బిజెపి, టిడిపి కూటమి శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు సోమవారం సాయంత్రం అపూర్వ ఘన స్వాగతం పలికారు. పెనుమూడి చెక్‌ పోస్టు ర్యాలీగా ఓల్డ్ టౌన్ అంకమ్మ చెట్టు, రింగ్ రోడ్ మీదుగా కృష్ణ టాకీస్, తాలూకా ఆఫీస్, రైల్వే స్టేషన్ వద్దగల ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగింది. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ నివాళి అర్పించారు. అక్కడి నుండి మున్సిపల్ ఆఫీస్, బస్టాండ్, లక్ష్మీ టాకీస్ సెంటర్ మీదుగా టిడిపి కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులు స్వాగతం పలికారు. టాపు లేని జీబుపై నుండి మంత్రి సత్యప్రసాద్‌ ప్రజలకు అభివాదాలు చేశారు. మహిళలు హారతులు పడుతూ స్వాగతం పలికారు. అనగాని, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. జనసేన, బిజెపి, టిడిపి ఉమ్మడి జెండాలు ద్విచక్ర వాహనాలపై పెట్టుకుని ర్యాలీ టిడిపి కార్యాలయం వరకు సాగింది. పూల దండలు, షాలువాలతో ఆయనను సత్కరించారు.

➡️