పరీక్షలకు సర్వం సిద్దం

Mar 18,2024 01:35

– నేటి నుంచి 30వరకు పరీక్షల నిర్వహణ
– జిల్లాలో 108 కేంద్రాలు ఏర్పాటు
– రెగ్యూలర్ విద్యార్థులు 16906మంది
– సప్లమెంటరీ విద్యార్థులు 2004మంది
– 972 మంది ఇన్విజిలేటర్లతో పరీక్షల నిర్వహణ
– సమస్యాత్మతక సెంటర్లు 8లో సీసీ కెమెరాలతో నిఘా
– పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
– విద్యార్థుల సందేహాల నివృత్తికి ప్రత్యేక చర్యలు
ప్రజాశక్తి – బాపట్ల
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం అసన్నమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు అధికారులు పక్కగా ఏర్పాట్లు చేసినట్లు డిఇఒ కె నారాయణరావు తెలిపారు. తొలిసారిగా పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్ధులకు పరీక్షల పరంగా ఎలాంటి సందేహాలు తలెత్తినా వెంటనే నివృత్తి చేసేందుకు ఇన్విజిలేటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈనెల 18 నుంచి 30వరకు జరగనున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 18910 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో 16906 మంది విద్యార్థులు రెగ్యూలర్ విద్యార్థులు కాగా 2004మంది సప్లమెంటరీ విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు రాసేందుకు జిల్లాలో 108పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. విద్యార్థుల హాల్ టిక్కెట్లను ఆయా పాఠశాలలకు చేర్చినట్లు తెలిపారు.
ఇన్విజిలేటర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డిఇఒ కె నారాయణరావు అన్నారు. పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే ప్రతి ఒక్క విద్యార్ధి హాల్ టిక్కెట్ తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు. పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులు కనీసం పావుగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఇన్విజిలేటర్లు, విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి సెల్ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోటోలతో కూడిన ప్యాడ్లు అనుమతించ బడవని అన్నారు. విద్యార్థులు పాఠశాల పేరుతో ఉన్న ఐడీకార్డులు, యూనిఫామ్ ధరించరాదని అన్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఎలాంటి జీరాక్స్, నెట్ సెంటర్ల తెరిచి ఉంచరాదని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా తెరిచిఉచ్చినట్లయితే సంబందిత షాపును సీజ్ చేస్తామని హెచ్చరించారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఆమలు
పదవ తరగతి పరీక్షలు నిర్వహించే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ వకులిందాల్ తెలిపారు. జిల్లాలోని 108 పరీక్షా కేంద్రాల వద్ద ఒక్కో కేంద్రం వద్ద ఇద్దరు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. వీళ్ళతోపాటు అన్ని సెంటర్లలో ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా చూసుకోవాల్సిందిగా ఎస్ఐ స్థాయి అధికారిని నియమించామని అన్నారు. పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు పరీక్షా కేంద్రానికి 100మీటర్ల దూరంలో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ ఉండరాదని అన్నారు. ఆయా ప్రాంతాల్లో జనాలు గుమికూడినా, కేకలు వేసినా అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్దం
ఈనెల 18 నుంచి 30వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. పరీక్షలకు సంబందించి 108 డిపార్ట్ మెంటల్ అధికారులు, 13మంది అడిషనల్ డిపార్ట్మెంటల్ అధికారులు, 972మంది ఇన్విజిలేటర్లు, 06ఫ్లైయింగ్ స్వ్కాడ్ బృందాలు, 45సిట్టింగ్ స్వ్కాడ్ బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు డిఇఒ తెలిపారు. జిల్లాలో 8 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

➡️