అమర్నాథ్ హంతకులను శిక్షించాలి

Jun 16,2024 23:35 ##Cherukupalli #Amarnadh

ప్రజాశక్తి – చెరుకుపల్లి
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ హత్య వంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ మనిలాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉప్పాల అమర్నాథ్ మొదటి వర్ధంతి సభ అమర్నాథ్ స్వగ్రామమైన ఉప్పాలవారిపాలెంలో ఆదివారం నిర్వహించారు. అమర్నాథ్ కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, బీసీ, గౌడ సంఘ నాయకులు అమర్నాద్‌కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్ధంతి సభకు బీసీవై రాష్ట్ర అధ్యక్షులు దొంత సురేష్ అధ్యక్షత వహించారు. సభలో మనిలాల్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో కిరాతకంగా హత్య చేయబడిన అమర్నాథ్ కేసును నూతన ప్రభుత్వమైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వెంటనే నిందితులకు శిక్షపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శరత్, కొప్పుల గోపి, ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ అధ్యక్షులు మనోజ్ కుమార్, బీసీ ప్రజాసంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️