రూ.68కోట్లతో మున్సిపల్‌ బడ్జెట్ ఆమోదం : కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుపై చర్చ

Dec 28,2023 00:28

ప్రజాశక్తి – చీరాల
మున్సిపల్ బడ్జెట్ సమావేశం ఛైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. రూ.68కోట్లతో బడ్జెట్‌ ఆమోదించారు. మున్సిపల్‌ అకౌంటెంట్ రేఖ బడ్జెట్ వివరాలు ప్రవేశపెట్టారు. 2024 -25సంవత్సరానికి రూ.11.11కోట్లు ప్రారంభ నిల్వ చూపారు. వివిధ పద్దుల కింద రూ.56.94కోట్లు, రూ.56.39కోట్లు వ్యయం చూపారు. రూ.11.66కోట్లు ముగింపు నిల్వ చూపారు. అభ్యంతరాలపై చర్చలు జరిగినప్పటికీ ప్రశాంతంగా బడ్జెట్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. అజెండాలో ప్రవేశపెట్టిన తొమ్మిది అంశాలను ఆమోదించారు. జీరో అవర్‌లో కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని అన్నారు. ఇప్పటివరకు రూ.2కోట్లకుపైగా కాంట్రాక్టర్లకు నిధులు బాకీ ఉన్నయని, వెంటనే చెల్లించే విధంగా అధికారులు న్యాయం చేయాలని కోరారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోతే అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అన్నారు. కమిషనర్ రామచంద్రరెడ్డి మాట్లాడుతూ బిల్లులకు ప్రపోజల్ పంపించామని తెలిపారు. జనవరి నుండి మార్చిలోపు బిల్లుల సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఫైర్ స్టేషన్ గేటు వద్ద నూతనంగా నిర్మించనున్న ఆర్ఓబికి భూమి పూజ ఎన్నికల కోడ్‌కు ముందే చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని చైర్మన్ శ్రీనివాసరావు కోరారు. టీపిఎస్ అధికారులు మాట్లాడుతూ ఈపాటికే కొలతలు పూర్తి చేశామని తెలిపారు. మ్యాపింగ్ కూడా సిద్ధం చేశామని అన్నారు. ఆర్అండ్‌బి అధికారుల పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. కౌన్సిలర్లకు గౌరవ వేతనాలు సకాలంలో రావటం లేదని గుంటూరు ప్రభాకరరావు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. గౌరవ వేతనాలు అన్ని సిఎఫ్ఎం ద్వారా రావలసి ఉన్నందున ప్రతిపాదనలు పంపించినట్లు కమిషనర్ తెలిపారు. త్వరలోనే సభ్యుల గౌరవ వేతనాలు ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. కౌన్సిలర్ బత్తుల అనిల్ మాట్లాడుతూ వాటిలో సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత అధికార దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పాలనను ప్రశ్నించే విధంగా వీడియోలు పోస్ట్ చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నట్లు అందరికీ తెలుసని అన్నారు. పారిశుధ్యంపై ఆ విధంగా పోస్టులు పెట్టడం సరైనది కాదని కౌన్సిలర్ సల్లూరి సత్యానందంను ఉద్దేశించి అన్నారు. అందుకు సత్యానందం స్పందించారు. తమ వార్డులో జరిగిన అభివృద్ధి పనులేమిటో తెలపాలని కోరారు. వార్డులోని సమస్యలపైన తాను పోస్ట్ చేశానని అన్నారు. వ్యక్తిగతంగా కాదు అంటూ వివరణ ఇచ్చారు. అభివృద్ది పనుల వివరాలు చెప్పేందుకు తాము సిద్దమైననే బత్తుల అనిల్‌ అన్నారు. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పెద్దపేట వేస్తున్నారని అన్నారు. నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా స్నేమపూర్వక వాతావరణంలో అభివృద్ధికి అందరు కృషి చేయాలని చైర్మన్ కోరారు.

➡️