ఎన్నికల నిబంధనలు వైసీపీకి వర్తించవా?

Mar 30,2024 00:11 ##ysrcpnews #vemuru

ప్రజాశక్తి – వేమూరు
ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చి పది రోజులు గడిచినప్పటికీ పంచాయతీ అధికారులు అధికార వైసిపికి చెందిన జెండా దిమ్మెలను, మంత్రుల పేర్లను తొలగించలేదు. వైసిపి అభ్యర్థి వరికూటి అశోక్ బాబు కూచిపూడి వైసిపి కార్యాలయం సమీపంలోనే ఏర్పాటు చేసిన వైసిపి జెండా దిమ్మెకు వైసీపీ మూడు రంగులతో ప్రజలను ఆకర్షించే విధంగా ఉంది. దీనికి సమీపంలో గ్రామానికి చెందిన వైసిపి నాయకులు రామ్మోహన్రావు విగ్రహ దిమ్మెకు ఏర్పాటు చేసిన శిలాఫలకాలు, వైసిపి మంత్రుల పేర్లు కూడా యధావిధిగానే కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు పంచాయతీ సిబ్బంది వీటిని తొలగించాల్సి ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఎన్నికల నిబంధనలు వైసీపీకి వర్తించవాని ప్రశ్నిస్తున్నారు. మూడు రంగుల దిమ్మెకు, శిలాఫలకంపై అధికార వైసిపికి చెందిన మంత్రుల పేర్లపై పేపర్లు గానీ, కవర్లు గాని అంటించాల్సి ఉండగా అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూచిపూడి ప్రధాన రహదారి ప్రక్కన, వైసీపీ కార్యాలయం సమీపంలో ఉన్న దిమ్మె శిలాఫలకం యధావిధిగా ఉండటం పట్ల ప్రజలు అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు చొరవ చూపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు.

➡️