బాపట్ల ప్రయాణంపై ప్రయాణికుల బేజారు

Mar 14,2024 23:55

అద్దంకి నుండి హైదరాబాద్‌కు ఐదు గంటలు
అద్దంకి నుండి బాపట్లకు ఐదు గంటల ప్రయాణం
ప్రజాశక్తి – పంగులూరు
జిల్లా కేంద్రం బాపట్ల ప్రయాణమంటే ఈ ప్రాంత ప్రయాణికులు “అయ్యబాబోయ్” అంటున్నారు. అందులోనూ ఆర్టిసి బస్ ప్రయాణం అంటే ప్రాణాంతక మే. అద్దంకి నుండి హైదరాబాద్‌కు వెళ్లాలంటే 300 కిలోమీటర్ల దూరం కేవలం నాలుగు గంటల్లో వెళ్లవచ్చు. అదే జిల్లా కేంద్రమైన బాపట్లకు 80కిలోమీటర్లు ప్రయాణం చేయాలన్న నాలుగు గంటలు పడుతుంది. హైదరాబాదు వెళ్లాలంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రశాంతంగా సంతోషకరమైన ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే 80కిలోమీటర్ల దూరంలోని బాపట్లకు వెళ్లాలంటే పట్టే నాలుగు గంటలు ప్రయాణికులకు నరకం కనిపిస్తుంది. బాపట్ల జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత అద్దంకి డిపో నుండి బాపట్లకు పల్లె వెలుగు సర్వీసు ప్రారంభించారు. ఈ సర్వీసు ఉదయం 6 గంటలకు బయలుదేరి 10గంటల తరువాత బాపట్ల చేరుతుంది. అద్దంకి, రేణింగవరం, ముప్పవరం, పంగులూరు, ఇంకొల్లు, పర్చూరు, చెరుకూరు మీదగా బాపట్లకు బస్సు నడుస్తుంది. సుమారు 80కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలంటే ప్రయాణికులకు ఇబ్బందిగా తయారైంది. ఈ రోడ్డు మార్గం ముప్పవరం నుండి బాపట్ల వెళ్లే వరకు అంతా గుంతల మయమే. గ్రామీణ డొంక రోడ్లలో బస్సు నడవాల్సి ఉంది. అద్దంకి నుండి అనేక మంది ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులు ప్రయాణిస్తూ ఉంటారు. జిల్లా కేంద్రంలోని అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కోసం నిరంతరం ప్రయాణికులు వెళ్తున్నారు. అయితే ఉదయాన్నే ఈ బస్సు ఎక్కిన ప్రయాణికులు సాయంత్రానికి ఇంటికి చేరుకుంటానన్న గ్యారెంటీ లేదు. బస్సులో ప్రయాణం వలన ఒళ్లంతా హూనం అవటం, సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు, జ్వరము వస్తుంది. అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు జిల్లా కేంద్రమైన ఒంగోలు వెళ్లాలంటే ఇక్కడ నుండి గంటలోపు ప్రయాణం. అదే ఇప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే నాలుగు గంటల ప్రయాణంతో పాటు నరకయాతన అనుభవించాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం అద్దంకి నుండి ఎక్స్ప్రెస్ బస్సును నడపడంతో పాటు మరో రెండు సర్వీసులను కూడా ఇక్కడి నుండి నడిపితే ప్రయాణం కొంత సులభతరం అవుతుందని ప్రయాణికులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లకు వెళ్లి రావడం కన్నా తెలంగాణ రాష్ట్ర కేంద్రం హైదరాబాద్‌కు వెళ్లి రావటం సులభంగా ఉందని ఇక్కడ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️