పంట నష్ట పరిహారం అందించాలి : రైతు సంఘం డిమాండ్‌

Dec 14,2023 23:18

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌
అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పూర్తి స్ధాయిలో నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం మండల కమిటీ తీర్మానించింది. స్ధానిక యుటిఎఫ్‌ కార్యాలయం ఆవరణలో రైతు సంఘం సమావేశం గురువారం నిర్వహించారు. రైతు సంఘం సీనియర్‌ నాయకులు కందిమళ్ళ రామకోటేశ్వరరావు మాట్లాడుతూ అకాల వర్షాలకు నష్టపోయిన పంటల గురించి వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాలని అన్నారు. పంట నష్టం తీవ్రంగా ఉంది కాబట్టి సబ్బిడీపై విత్తనాలు ఇచ్చినా అదును పోయింది కనుక పంటల భీమా వర్తింపచేయాలని అన్నారు. పాక్షికంగా నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్‌ సబ్బిడీ ఇవ్వాలని అన్నారు. కౌలు కార్డులతో నిమిత్తం లేకుండా సాగు దార్లను చూసి నష్టం జరిగిన పంటలను నమోదు చేసి రైతులను ఆదుకోవాలని తీర్మానించారు. గ్రామాల్లోని రైతు సంఘం కార్యకర్తలు రైతు భరోసా కేంద్రాల్లోని అధికారులతో చర్చించి సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళి రైతులకు న్యాయం చేసే విధంగా చూడాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశానికి నార్నె సింగయ్య అధ్యక్షత వహించారు. సమావేశంలో బండి సాంబయ్య, చిలుకూరి శ్రీనివాసరావు, మాదల అంజయ్య పాల్గొన్నారు.

➡️