రైతు, చేనేత ఉద్యమాలతోనే కొరటాలకు నిజమైన నివాళి : సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య

ప్రజాశక్తి – బాపట్ల
రైతు, చేనేత సమస్యల పరిష్కారానికి చేసే ఉద్యమాలే కొరటాలు సత్యనారాయణకు నిజమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య అన్నారు. కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ 18వ వర్ధంతిని ప్రజా సంఘాల కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. కొరటాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పూర్వ కార్యదర్శి, పోలిట్‌బ్యూరో మాజీ సభ్యులు, రైతు, వ్యవసాయ కార్మిక, చేనేత కార్మిక ఉద్యమ సారథి కొరటాల సత్యనారాయణ అని అన్నారు. ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో 1923 సెప్టెంబర్‌ 24న భూస్వామ్య కుటుంబంలో జన్మించారని అన్నారు. విద్యార్థి దశలోనే 14ఏళ్ల వయసులో డిటెన్షన్‌కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమంతో ప్రజా జీవితంలోకి ప్రవేశించిన కొరటాల 2006 జులై 1న అనారోగ్యంతో మరణించే వరకు ఏడు దశాబ్దాల పాటు ఎర్రజెండా చేత పట్టుకుని అలుపెరుగని పోరాటం చేశారని అన్నారు. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్బంధ కాలంలో నాలుగేళ్లు అజ్ఞాత జీవితం గడిపారని అన్నారు. అజ్ఞాత జీవితంలో ఉండగా 1948లో అరెస్టు చేసి మూడేళ్ళకుపైగా బళ్లారి, కడలూరు జైళ్ళలో నిర్బంధించారని అన్నారు. చల్లపల్లి జమిందారుకు వ్యతిరేకంగా భూపోరాటం చేశారని అన్నారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్రంలో కరువు, తుఫాన్‌ వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా బాధితుల పక్షాన నిలబడి ఉద్యమాలు నిర్వహించారని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకునిగా బంజరు భూములు పంచాలని, కూలి రేట్ల పెంచాలని, ఉపాధి వంటి సమస్యలపై ఉద్యమాలు చేశారని అన్నారు. చేనేత కార్మికుల మజూరి, రంగుల ధరలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు వంటి సమస్యలపై ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు విధానాలను రూపొందించాలని కొరటాల స్ఫూర్తితో సమరశీల రైతు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. అదే కామ్రేడ్‌ కొరటాలకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో వై భాస్కరరావు, కె శరత్ బాబు, షేక్ సుభాని, జి ప్రతాప్ కుమార్, శ్రీను, టి సుభాషిణి పాల్గొన్నారు.


రేపల్లె : సీపీఎం నేత కామ్రేడ్ కోరటాల సత్యనారాయణ 18వ ర్దతిసభ స్థానిక సీపీఎం కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. కొరటాల చిత్రపటానికి సీపీఎం నాయకులు కె అశ్విరాథం పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రేపల్లె నియోజకవర్గం నుంచి 1962, 1978లో రెండు సార్లు శాసన సభకు ఎన్నికయ్యారని అన్నారు. సభలో సిపిఎం, ప్రజా సంఘాల నేతలు కెవి లక్ష్మణరావు, జి దానియేలు, డి శ్రీనివాసరావు, ఆగస్టిన్, జి ధర్మరాజు, సీఐటీయు ఆటో యూనియన్ నాయకులు యు నాంచారయ్య పాల్గొన్నారు.


కొల్లూరు : అనంతవరంలో సిపిఎం అగ్రనేత కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ 18వ వర్ధంతి సందర్భంగా సిపిఎం నాయకులు గోళ్ళ రాంబాబు, బొనిగల సుబ్బారావు ఆధ్వర్యంలో కొరటాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బొనిగల ప్రసాద్, మేడికొండ గోవర్ధన్, ఎద్దు ప్రసాద్, గద్దె సుధీర్, వాగోలు మాధవి పాల్గొన్నారు.


మేదరమెట్ల : కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ 18వ వర్ధంతి సందర్భంగా స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం ఆంజనేయులు, ప్రజా నాట్య మండలి పూర్వ గౌరవ అధ్యక్షులు బి దశరథ, ఉపాధ్యాయ నాయకులు కె పోతురాజు, వై రవీంద్రబాబు, జయమ్మ, వైకుంఠం, బాబురావు పాల్గొన్నారు.


భట్టిప్రోలు : సిపిఎం నేత కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ 18వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చేనేత సహకార సంఘం కార్యాలయం వద్ద కొరటాల చిత్రపటానికి సిపిఎం సీనియర్ నాయకులు శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి అహరోన్, బట్టు నాగమల్లేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు పి మనోజ్, కె రామారావు పాల్గొన్నారు.

➡️