బిజెపి, ఎన్డీఏ కూటమిని ఓడించండి : సిపిఎం

Mar 30,2024 23:34 ##APCPM #Battiprolu #NDA #BJP

ప్రజాశక్తి – భట్టిప్రోలు
దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించటమే కాక ఆంధ్ర రాష్ట్రానికి బిజెపి చేసిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి, బిజెపి, ఎన్డీఏ కూటమిని రానున్న ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య కోరారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ, రాష్ట్ర ప్రజలను బిజెపి పాలనలో నరేంద్ర మోడీ తీవ్రంగా మోసం చేశారని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం అమలు చేయాల్సిన అంశాలను పూర్తి చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారని అగ్రహారం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం, దానికి నిధులు కేటాయించకపోవడం, పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం కావడమే కాక విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయటానికి పూనుకోవటం వంటి అన్యాయాన్ని ఆంధ్ర రాష్ట్రానికి బిజెపి చేసిందని అన్నారు. అలాంటి బిజెపికి రానున్న ఎన్నికల్లో బహిరంగంగా టిడిపి, జనసేన పొత్తు కలుపుకోగా పరోక్షంగా వైసిపి కూడా బిజెపికే మద్దతు ఇస్తుందని ఆరోపించారు. రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ప్రశ్నించకపోగా బిజెపికి మద్దతు పలికి రాష్ట్రానికి మరో మారు అన్యాయం చేయాలని చూస్తున్న ప్రాంతీయ పార్టీలకు ప్రజలు ఓట్లు వేస్తే భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం అదోగతి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బిజెపి వ్యతిరేక పార్టీలు కూటమిగా ఏర్పడి పనిచేస్తున్నాయని, వాటికి మద్దతునిచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్, ఎం సత్యనారాయణ, జి నాగరాజు, దీపాల సత్యనారాయణ, కె రామస్వామి, పి మనోజ్ పాల్గొన్నారు.

➡️