వాలంటీర్ వ్యవస్థపై ఉద్దేశపూర్వక విమర్శలు : ఎంఎల్‌ఎ కోన రఘుపతి ఆరోపణ

ప్రజాశక్తి – బాపట్ల
వాలంటీర్ వ్యవస్థపై జనసేన, బిజెపి, టిడిపి కూటమి విషం చిమ్ముతోందని ఎంఎల్‌ఎ కోన రఘుపతి ఆరోపించారు. తన ఛాంబర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమూల మార్పుకు శ్రీకారం చుట్టిన జగన్మోహన్‌రెడ్డి వాలంటీర్ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన అమలు చేశారని అన్నారు. ఈ వ్యవస్థపై కూటమి కుంపటి పెట్టడంతో ఈ నెల్లో వృద్ధులు, వికలాంగులకు అందాల్సిన పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతుందని అన్నారు. అయితే బాపట్ల ప్రజాగళంలో చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తీవ్ర స్థాయిలో ఖండించారు. రైతు సమస్యల పట్ల అవగాహన లేని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. బాపట్ల ప్రాంత రైతు సమస్యలు కనీసం తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు. గిట్టుబాటు ధర లేదని, కాలువల పూడిక తీత పనులు జరగలేదని అబద్ధాలు చెప్పాడని అన్నారు. వచ్చాను కదా అని ఎదో ఒకటి మాట్లాడాలని మాట్లాడాడే తప్ప బాపట్ల కోసం చంద్రబాబు ఏం చేశాడో చెప్పలేదని అన్నారు. కనీసం రాష్ట్రానికి ఏం చేయగలడో కూడా చెప్పలేదని అన్నారు. రఘుపతి గురించి ఏదో నాలుగు అబద్ధపు మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం పరిపాటైందని అన్నారు. టిడిపి హయాంలో తవ్వేసిన ఇసుక గుంటలు సాకుగా చూపి ఇక్కడ ఇసుక దందా జరిగిందని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. మైనింగ్ శాఖకు ఇసుక సీనరేజీ ద్వారా రూ.13కోట్లు రాబడి లభించింది అన్నారు. కండువా కూడా కప్పని వ్యక్తిని వరంగల్ నుంచి తెచ్చి బాపట్ల ఎంపీ టికెట్ ఇచ్చారని అన్నారు. బిజెపితో పొత్తుతోనే చంద్రబాబు తన ఓటమిని అంగీకరించినట్లని అన్నారు. బిజెపితో పొత్తు లేకుంటే జైలుకి వెళ్లి ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుందనే ఎంపీ సీట్లు ఇవ్వడంతో పాటు, అడగని బాపట్ల ఎంపి సీటును కూడా బిజెపి అభ్యర్థికి ఇచ్చారని అన్నారు. బాపట్లలో పేదలకి సెంటున్నర ఇళ్ల స్థలాలు ఇవ్వడం గొప్ప విషయమని ప్రజలు భావిస్తుంటే, దీనిపై కూడా విమర్శలు చేయడం అవివేకమని అన్నారు. సమావేశంలో బాపట్ల ఎంపీపీ చిన్నిపోతుల హరిబాబు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఎజ్రయ్య, వైసిపి మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, ఎఎంసీ మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి పాల్గొన్నారు.

➡️