మిరప, పొగనారుకు గిరాకీ

Dec 14,2023 23:20

మిరప మొక్క మూడు రూపాయలు
ప్రజాశక్తి – ఇంకొల్లు
పకృతి పగబట్టింది. ప్రభుత్వం సహాయం చేయలేదు. అయినప్పటికీ అందరికీ అన్నం పెట్టే అన్నదాత సాగుపోరులో మళ్ళీ ముందుకు సాగుతున్నాడు. అవసరమైన పంటలు మళ్లీ పండించడం కోసం ముందుకు కదిలాడు. దెబ్బతిన్న పొగ మొక్కల స్థానంలో మళ్లీ పొగ మొక్కలు నాటేందుకు, ఉరకెత్తిన మినప మొక్కలను తొలగించి మళ్లీ మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యాడు. ఉన్న అప్పులకు తోడు మళ్ళీ అప్పులు చేసి భార్య మెడలో పుస్తెలు సైతం తాకట్టు పెట్టి పెట్టుబడులు పెట్టుటకు ముందుకు సాగాడు. ఇదే అదునుగా నారు పెంపకం దారులు ఆ నారుకు గిరాకీ పెంచారు.
మిరప నారుకు గిరాకీ
ఏడాది ప్రారంభం నుండి మిరప నారు అమ్మకాలు మందకోడిగా సాగాయి. గతంలో కన్నా విస్తృతంగా కొత్త నెట్లు ఏర్పాటు చేసి నారు పెంచడంతోపాటు నారుమడుల్లో నారు పెంచడం కూడా అధికంగా సాగటం వల్ల ఈ ఏడాది ఆరంభం నుండి మిరప నారు గిరాకీ తక్కువగా, కొంచం మంద కోడిగా అమ్మకాలు సాగాయి. దానికి తోడు వర్షాభావం వెంటాడింది. కాలువల్లో నీరు రాకపోవడంతో మిరప విస్తీర్ణం తగ్గింది. అయితే తుఫానుకు దెబ్బతిన్న మిరప తోటల స్థానంలో మళ్లీ మిరప మొక్కలు నాటడంతో పాటు దుక్కులు ఉన్న ప్రాంతాలలో కొత్తగా మిరప నాట్లు వేయటానికి రైతులు ఉపక్రమిస్తున్నారు. దీంతో మిరప నారుకు గిరాకీ ఏర్పడింది. తుఫాను ముందు వరకు హైబ్రిడ్ నారు మొక్క రూపాయి నుంచి రూపాయిన్నర లోపే దరపలకగా ఇప్పుడు ఆ మొక్క ధర రూ.2.50 నుంచి మూడు రూపాయలు పలుకుతుంది. ఎకరాకు దాదాపు 7500 మొక్కలు అవసరం అవుతాయి. ఈ లెక్కన ఎకరం నారుకే రూ.22వేలకుపైన ఖర్చు అవుతుంది. దీనికి తోడు అందనంగా నాటుకూలి రూ.4వేలు, వ్యవసాయం మరో రూ.2వేలు అవుతుంది.
పొగనారుకు గిరాకి
ఈ ఏడాది పొగనాట్లు ప్రారంభం నుండి పొగనారు గిరాకీ గానే ఉంది. మొదట్లో నారు మూట రూ.4వేలు అమ్మగా పొగనాట్లు ఊపొందుకునేసరికి వర్షానికి ముందు అదే మూట రూ.6వేలు అమ్మింది. ఇప్పుడు దెబ్బతిన్న పొగాకు చేలల్లో వాటిని తొలగించి మళ్లీ నాటు వేస్తున్నారు. వాటితోపాటు దుక్కులుగా ఉన్న పొలాలలో కొత్తగా పొగనాట్లు వేయటం ప్రారంభించారు. దీంతో నారు ధరకు రెక్కలు వచ్చాయి. ఒక్క మాట రూ.10వేల వరకు పడుతుంది. నారు పెంపకం దారులు ఒక్కో మూటకు వచ్చి 5వేల నుంచి 6వేలలోపే మొక్క ఇస్తారు. ఒక్క ఎకరాకు 8వేల నుంచి 9వేల వరకు ఒక మొక్కలు అవసరం అవుతాయి. రెండు ఎకరాలకు మూడు మూటల పొగనారు అవసరం అవుతుంది. ఈ లెక్కన ఒక్కో ఎకరానికి పొగనారు ఖర్చు రూ.15వేల వరకు పడుతుంది. దీనికి తోడు వ్యవసాయం, నాటుకూలి మరో రూ.4వేలు అదనంగా అవుతాయి. అయినప్పటికీ రైతులు మళ్ళీ పొగనాట్లు ప్రారంభిస్తున్నారు. ఆరుతున్న మెరక పొలాల్లో నాట్లకు ఉపక్రమించారు. ఈ లెక్కన ఒక్కొక్క పొగ మొక్కే రూపాయిన్నర, నాటు కూలీ మొక్కకు రెండు రూపాయలు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు.

➡️