తగ్గిన పండుగ ఉత్సాహం

Jan 1,2024 00:31

ప్రజాశక్తి – పంగులూరు
కొత్త సంవత్సరం అనగానే అందరిలోనూ ఆనందం కనిపిస్తుంది. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సీట్లు పంచుకోవడం, స్నేహితులతో ఆత్మీయ పలకరింపులు, ఇళ్ళ ముందు సంక్రాంతి పండుగ నెల మొదలైనట్లు మహిళల ముగ్గులు ఇలా ఒకటేమిటి. అంతా ఆనందమే కనిపించేది. అయితే ఈ సంవత్సరం మండలంలో అలాంటి ఉత్సాహం ఎక్కడా కనిపించలేదు. రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, మధ్యతరగతి ప్రజల్లో కూడా నూతన సంవత్సరం ఉత్సాహం కనిపించడం లేదు. ఎవరిలోనూ నూతన హడావుడి లేదు. మించౌంగ్ తుఫాను కారణంగా పంటల మొత్తం దెబ్బతిన్నాయి. మిర్చి, శనగ, మినుము, వరి, మొక్కజొన్న పంటలపై తుఫాను ప్రభావం బాగా పడింది. పంటలు దెబ్బతిని రైతాంగం దిగాలు పడుతున్నారు. శనగ పంట దెబ్బతింది. నూతన సంవత్సర వేడుకల్లో ఖర్చుపెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఆ ఖర్చేదో మళ్లీ పొలంపై పెడితే బాగుండని ఆలోచన చేస్తున్నారు. రైతుల వద్ద నగదు చలామణి తగ్గడంతో కూలీలకు రోజు గడవడం కష్టమైంది. మరోవైపు ఉద్యోగులకు ప్రభుత్వ విధానం కారణంగా ఒకోటతేదీ జీతం వస్తుందన్న నమ్మకం లేదు. అంగన్‌వాడీలు, మున్సిపల్‌, పంచాయితీ కార్మికులు, సర్వశిక్ష అభియాన్‌ ఇలా వరుసగా నిరవధిక సమ్మెలతో జనం మూడ్‌ మారిపోయింది. ఇసుక కొరతతో నిర్మాణ పనులూ తగ్గిపోయాయి. నిర్మాణ కార్మికులైన బేలుదారీ, ఇతర నిర్మాణ పనుల్లో ఉండేవారివద్ద ఆర్ధిక ఇబ్బందులు తాండవిస్తున్నాయి. రైతులు, వ్యవసాయ కూలీల వద్ద డబ్బు ఉంటే సండుగకు ఏదో ఒకటి కొనుగోలు చేసేవాళ్లని వ్యాపారులు ఇచెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే వ్యాపారాలు కూడా తగ్గాయని చెబుతున్నారు. పుష్కలంగా పనులు ఉంటే నూతన సంవత్సరానికి కొత్త బట్టలు, పిండి వంటల హడావుడి ఉండేదని అంటున్నారు. కొత్త ఆశలతో కేరితలు కొట్టాల్సిన యువత ఉపాధి లేక నిరుత్సాహంగా ఉండటం పండుగ కళ తప్పినట్లయింది.
పర్చూరు : నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఐదు మిఠాయి షాపులు ఏర్పాటు చేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వీట్ హోమ్ యజమాని సమ్మెట శ్రీనివాసరెడ్డి ప్రజాశక్తితో మాట్లాడుతూ ఈ సంవత్సరం 60రకాల స్వీట్లు చేశామని తెలిపారు. ఇటీవల వచ్చిన తుఫాన్ కారణంగా కొనుగోళ్లు తగ్గాయని అన్నారు. వ్యాపారం మామూలుగానే ఉందని చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు తక్కువగానే ఉన్నాయని అన్నారు. పిస్తా, కళాకాని, బెంగాలీ స్వీటు, గులాబ్ జామ్, డ్రై ఫ్రూట్ హల్వా ప్రత్యేకంగా చేశామని చెప్పారు. బెంగాల్ పాన్, ఆగ్రాఫా, ఐస్ క్రీమ్, కేకు, పిస్తా రోల్ స్పెషల్‌గా చేశామని తెలిపారు. స్వీట్ల రకాన్ని బట్టి కేజీ రూ.365నుంచి రూ.600, రూ.300రేట్లు ఉన్నాయని తెలిపారు.

➡️