అధైర్యపడొద్దు అండగా ఉంటా : మోపిదేవి

Dec 10,2023 00:09

ప్రజాశక్తి – రేపల్లె
రైతులు అధైర్యపడొద్దని, ప్రభుతం అండగా ఉందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రామారావు అన్నారు. తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు పక్షపాతిగా సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రైతులను ఆదుకునేందుకు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. రైతులకు పంట నష్టం జరిగితే గిట్టుబాటు ధర కల్పించారని గుర్తుచేశారు. నాలుగు రోజుల క్రితం తుఫాను సృష్టించిన విలయానికి జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయారని అన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో సిఎం వైఎస్ జగన్ స్పందించి జిల్లా యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారని చెప్పారు. పంట నష్టం జరిగిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగానే సిఎం జిల్లా పర్యటన చేశారని చెప్పారు. వ్యవసాయం దండగ అన్న పెద్దమనిషి చంద్రబాబు అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కరువు, కాటకాలు సంభవించలేదా అని ప్రశ్నించారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలని అన్నారు. చంద్రబాబు రైతుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించిన దాఖలాలు లేవన్నారు. అలాంటి వ్యక్తి తాను గట్టు గట్టుకు తిరుగుతూ పంట నష్టం జరిగిందని మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. సిఎం జగన్‌కు పని భారం ఉన్నప్పటికీ రైతులను ఓదార్చేందుకు వచ్చారని చెప్పారు. ఏ పని పాట లేదు కాబట్టి చంద్రబాబు గట్టు గట్టు తిరుగుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 2014-15లో సంభవించిన హుదూద్, తిత్లి తుఫానుల్లో పంట నష్టం జరిగిన రైతులకు చంద్రబాబు ఏ మేరకు న్యాయం చేశారో చెప్పాలని అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ రూ.960కోట్లు పెండింగ్ పెట్టారని, విత్తన బకాయి రూ.230కోట్లు, సున్నా వడ్డీ రూ.1200కోట్లు చంద్రబాబు బకాయిలు పెట్టారని అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న 474మంది రైతులకు ఇవ్వాల్సిన పరిహారం రూ.24కోట్లు, తిత్లి తుఫాను పంట నష్టం రూ.200కోట్లు, ఇలా మొత్తం రూ.6వేల కోట్ల పెండింగ్ బకాయిలను జగన్మోహన్ రెడ్డి తీర్చారని వివరించారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి రైతులకు అనేక హామీలు ఇచ్చి ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. రూ.74వేల కోట్లతో రైతుల పంట రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంకు వచ్చాక కేవలం రూ.1200కోట్లు మాఫీ చేశారని అన్నారు. రైతన్నను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని ఆరోపించారు. తుఫానులో పంట నష్టం జరిగితే అది ప్రభుత్వ వైఫల్యం అని, తాను అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకుంటామని మరోసారి రైతులను మోసగించేందుకు పర్యటిస్తున్నారని అన్నారు. చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేసే నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అర్ధరాత్రి పంట పొలాలను పరిశీలిస్తూ ప్రభుత్వాన్ని నిందించడం తగదని అన్నారు. రైతులకు జరిగిన నష్టం ప్రతి రూపాయి చెల్లిస్తామని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. దేవాదాయ, ఈనాం, ప్రభుత్వ భూములు, కౌలు రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

➡️