అక్కేవారిపాలెం గ్రామంలో త్రాగునీటి ఇక్కట్లు

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని పెద పులివరు పంచాయతీలోని అక్కివారిపాలెం గ్రామంలో భూగర్భ జలాలు మార్పు చెందాయి. ప్రజలకు త్రాగునీరు భారమైంది. గ్రామంలో కలుషితమైన భూగర్భ జలాలతో గత పది రోజులకుపైగా గ్రామస్తులు అతిసార వ్యాధికి గురై నాన అవస్థలు పడుతున్నారు. గత కొన్నిళ్ళుగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాల్లో మార్పు రావడంతో త్రాగేందుకు వీలు లేకపోగా ఉన్న నీటిని వినియోగిస్తే పలు రకాల రోగాలకు గురికావాల్సి వస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేజర్ పంచాయతీగా ఉన్న పెదపులివరు పంచాయితీలో గ్రామానికి దూరంగా అక్కివారిపాలెం, పెద్దపాలెం, కోళ్లపాలెం వంటి దళితవాడలు ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు అందుబాటులో ఉండటంతో ఎక్కడికి అక్కడ గ్రామాల్లో నేరుగా గ్రామస్తులకు నీరు చేరే విధంగా బోర్లు ద్వారా పంపులు ఏర్పాటు చేశారు. ఈ నీటిని ఎప్పటినుండో ప్రజలు వినియోగించుకుంటున్నారు. కాగా ఏడాది పూర్తిగా నీరు కలుషితమై త్రాగితే అతిసార వ్యాధి సోకి వాంతులు, వీరేశనాలతో బాధపడుతున్నారు. ఇటీవల ఈ నీటిని సంబంధిత అధికారులు నమూనా తీసి ల్యాబ్‌కు పంపించారు. ఈపాటికే గత ఏడాది కాలంగా గ్రామస్తులు మారిపోయిన ఈ నీటిని వినియోగించు కోవటానికి పనికి రాకపోవడంతో బయట గ్రామాల నుండి వాటర్ ప్లాంట్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకుని త్రాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.
రోగాలు వెలుగు చూసేంత వరకు పట్టించుకోని పంచాయితీ
గ్రామంలో బోరు వసతి ఉన్న నీరు కలుషితమై త్రాగటానికి వీలు లేక ప్రజలు దూరప్రాంతాల నుండి త్రాగునీటినీ కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటున్న అంశం పంచాయతీ అధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత పది రోజులుగా ఈ నీటిని తాగిన ప్రజలు అస్వస్థకు గురై అతిసార వ్యాధి బారిన పడ్డారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. అతిసారకు కారణాలు తెలుసుకునేందుకు నీటి వనరులను పరీక్షించారు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు నీటిని ల్యాబ్‌కు పరీక్ష కోసం పంపించారే తప్ప ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాల ద్వారా విడుదలయ్యే నీటిలో వచ్చిన మార్పును పరిశీలించి గ్రామస్తులకు సరైన త్రాగునీరు అందే విధంగా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు.

➡️