విద్యావేత్త ప్రసాద్‌ విగ్రహావిష్కరణ

Jan 13,2024 01:00

ప్రజాశక్తి – నగరం
శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్‌ఆర్‌కె ప్రసాద్ విగ్రహ ఆవిష్కరణ కళాశాల్లో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు, ఎస్‌ఆర్‌కె సతీమణి నలిని ప్రసాద్ విగ్రహావిష్కరణ చేశారు. సభకు కళాశాల కరస్పాండెంట్ వల్లబనేని బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. కళాశాల స్థాపన నుండి రాజేశ్వరి రామకృష్ణన్ నేతృత్వంలోని బృందం చేసిన కృషి ఫలితంగా కళాశాల ఉన్నతంగా నిలిచిందని అన్నారు. రాజేశ్వరి కళాశాలపై గల అవ్యాజమైన ప్రేమను స్మరించుకున్నారు. రాజేశ్వరి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నూతన పరిస్థితులకు అనుగుణంగా కళాశాలను ప్రగతి పథంలో నడపడానికి ఎస్‌ఆర్‌కె ప్రసాద్ చేసిన కృషిని, ఆ సమయంలో సహకరించిన పెద్దలందరి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎంపి నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిన ఘనమైన చరిత్రగల కళాశాల రానున్న కాలంలో మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎస్‌ఆర్‌కె ప్రసాద్ కుటుంబం తరాల నుండి వస్తున్న విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు అభినందించారు. కళాశాల పాలకవర్గ జీవితకాల ఉపాధ్యక్షులు నామా నందిత ప్రసాద్ మాట్లాడుతూ ఎస్ఆర్‌కె ప్రసాద్ నేతృత్వంలో కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా రావడం నాక్‌లో ఉత్తమగ్రేడ్‌ను సాధించడంతోపాటు అధ్యాపకులను పరిశోధన వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించారని తెలిపారు. ఎస్ఆర్‌కె ప్రసాద్ విద్యారంగానికి సంబంధించి సాధించిన పలు అవార్డులు, రివార్డుల గురించి తెలిపారు. తన తండ్రి తనతో కళాశాల గురించి పంచుకున్న వివిధ అనుభవాలను స్మరించుకున్నారు. రానున్న రోజుల్లో విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు నామా పృథ్వితేజ, కోయంబత్తూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోఆర్డినేటర్ దివ్య మోహనరాజీవ్ మాట్లాడుతూ ప్రాంతీయ భాషల్లో మాట్లాడే నైపుణ్యం గల విద్యార్థులు ఇంగ్లీషు నేర్చుకోవడం చాలా సులభమని అన్నారు. ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్య శిక్షణకు సహకరిస్తామని తెలిపారు. కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు నర్రా కృష్ణ ప్రసాద్, బాపట్ల ఎడ్యుకేషనల్ సోసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు, పరిటాలలోని ఎంవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధినేత శ్రీనివాసబాబు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ, కళాశాల ఎఒ సుధాకరరావు, పీజీ డైరెక్టర్ సురేంద్రబాబు పాల్గొన్నారు.

➡️