అంగన్‌వాడీలపై ఎస్మా సిగ్గుచేటు

Jan 7,2024 00:01

ప్రజాశక్తి – చీరాల
మహిళలకు రక్షణ కల్పిస్తున్నామంటూ ప్రగల్బాలు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు అంగనవాడి కార్యకర్తలపై నిర్బంధ చట్టాలను ప్రయోగిస్తూ అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద చేస్తున్న నిరసన సమ్మెకు ఆమె మద్దత్తు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీల సమ్మె 26వ రోజుకు చేరింది. ఎన్నికలకు ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలిపితే ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక మరోలా జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతున్నాడని అన్నారు. తాను మహిళాపక్షపాతినని మాటలు చెబుతూ చేతల్లో మహిళలపై నిర్బంధ చట్టాలు ప్రయోగిస్తున్నాడని అన్నారు. చరిత్రలో ఎంతోమంది ఇలాంటి చట్టాలు తీసుకొచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్లారని అన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే వెంటనే చర్చలకు పిలిచి అంగన్‌వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్మా చట్టానికి నిరసనగా గడియార స్థంభం వరకు ర్యాలి నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ గంగయ్య, ఎన్ బాబురావు, ఏం వసంతరావు, పి ప్రమీల, ఏ బ్లూలా, జి సుజన పాల్గొన్నారు.


రేపల్లె : రాజన్న రాజ్యం అంటూ హిట్లర్ పాలనని గుర్తు చేస్తున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ మణిలాల్‌ అన్నారు. సమ్మె శిబిరంలో వైఎస్సార్ చిత్రపటం పెట్టి ఎస్మా ప్రయోగించినా జీఒ కాపీలను దగ్ధంచేసి సమ్మెను కొనాసాగిస్తామని తెలిపారు. 26వ రోజు అంగన్‌వాడీ సమ్మెలో భాగంగా రాజన్న రాజ్యంలో సిగ్గుగా బెదిరింపుల అంటూ వైఎస్సార్ చిత్రపటం ముందు ఎస్మా జీఒను దగ్ధం చేశారు. గౌరవ వేతనం పొందుతున్న అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడం అంటే ప్రభుత్వం మీద అంగన్‌వాడీలు విజయం సాధించినట్లేనని అన్నారు. నిస్సిగ్గుగా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందని అన్నారు. చిన్న ఉద్యోగులైన అంగన్‌వాడీలు సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా అత్యవసర విభాగాల పరిధిలో ప్రయెగించే ఎస్మా చట్టపరిధిలో అంగన్‌వాడీలను చేర్చి బెదిరించడాన్ని ప్రజాస్వామ్య వాదులు, కార్మిక సంఘాలు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. 2003లో తమిళనాడులో ఎస్మా ప్రయోగించిన జయలలిత ఓటమిపాలై ఇంటి బాటపట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి కూడా ఇంటిబాట పట్టడానికి మార్గం సుగమం చేసుకొంటున్నారని అన్నారు. అంగన్‌వాడీ యూనియన్ కార్యదర్శి కె వాణి మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో అంగన్‌వాడీలు ఒక్కరే కాదు, కార్మికవర్గం మొత్తం ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోరాడుతుంటే అంగన్‌వాడీలను టార్గెట్ చేసి బెదిరించటం అంటే అంగన్‌వాడీల పోరాటాలకు ప్రభుత్వం భయపడుతుందని అన్నారు. జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీ మహిళలు ఈరోజు నుండి రాత్రిపూట కూడా నిరవధిక రిలే నిరాహారీక్షలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి భయం పుట్టుకొచ్చిందని అన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు బెదిరేది లేదని, సమ్మె కొనసాగిస్తామని, ఎస్మా పట్ల న్యాయస్థానాలను ఆశ్రయించి, అంతిమంగా విజయం సాధిస్తామని అన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్, సిఐటియు నాయకులు డి జ్యోతి, వై మేరీమణి, నిర్మలజ్యోతి, శ్రీలత పార్వతి, రజిని, ప్రజా సంఘాల నాయకులు కెవి లక్ష్మణరావు పాల్గొన్నారు.


పర్చూరు : న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీల సమ్మె శనివారం నాటికి 26వ రోజుకు చేరింది. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద చేస్తున్న అంగన్‌వాడీల నిరసనలో భాగంగా ఈరోజు ఖోఖో ఆటలు ఆడి తమ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె శ్రీనివాసరావు ఎం డేవిడ్, బి చిన్నదాసు, ఐ వెంకటలక్ష్మి, టి రాణి, టి జోస్నా, పి శ్యామలదేవి, విజయలక్ష్మి పాల్గొన్నారు.


యద్దనపూడి : అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె శనివారం 26వ రోజు కొనసాగించారు. అంగన్‌వాడీలు తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో జ్యోత్సన, రేవతి, రమ, విజయ, సుమ, రత్న, మేరీ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.


మార్టూరు రూరల్ : అంగన్‌వాడీల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 26 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న నేపథ్యంలో అంగన్‌వాడీలు శనివారం వినూత్నంగా నిరసన చేపట్టారు. సిఐటియు జిల్లా నాయకులు బత్తుల హనుమంతరావు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దారు కార్యాలయం ముందు 26వ నంబర్ ప్రదర్శిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని యూనియన్ నాయకులు తాళ్లూరు రాణి, శ్యామల, రాజేశ్వరి, కుసుమ, నాగపుష్పరాణి చెప్పారు.


కొల్లూరు : అంగన్‌వాడీ యూనియన్ ఆధ్వర్యంలో 26వ రోజు కూడా నిరసన కొనసాగించారు. అంగన్‌వాడి కార్యకర్తలు కళ్ళు మూసుకుని నిరసన తెలిపారు. ఈ ప్రభుత్వం కళ్ళు ఉండి కూడా అంగన్‌వాడి కార్యకర్తల సమస్యలను పరిష్కరించలేకపోతుందని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి సుబ్బారావు, అంగన్‌వాడీ లీడర్స్ సౌభాగ్య లక్ష్మి, భాగ్యం, కాశి పద్మ, ఆదిలక్ష్మి, నాగరాజ కుమారి పాల్గొన్నారు.


నిజాంపట్నం: అంగన్‌వాడిల సమ్మెలో బాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న 24గంటల రిలే నిరవధిక నిరాహారదీక్షకు మద్దతుగా అంగన్‌వాడీ కార్యకర్తలు బాపట్ల తరలివెల్లి సమ్మె శిబిరంలో మద్దతుగా దీక్ష చేశారు. అంగన్‌వాడీ యూనియన్ నాయకురాలు ఉషా మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో 24గంటల రిలే నిరాహార దీక్ష శనివారం నుండి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్యమాన్ని ధైర్యంగా కొనసాగిస్తామని అన్నారు. తమ హక్కులు సాధించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకురాలు రాజేశ్వరి, శ్రీలక్ష్మి, ధనలక్ష్మి, గాయత్రి పాల్గొన్నారు.


పంగులూరు : బెదిరింపులకు ఉధ్యమాలు ఆగవని సిపిఎం జిల్లా నాయకులు రాయిని వినోద్ బాబు అన్నారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్వాడీల శిబిరంలో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీలను ప్రభుత్వం భయపెట్టాలని చూస్తుందని అన్నారు. చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు కార్మికులను, ఉద్యోగులను బెదిరించి విఫలమయ్యాయని అన్నారు. అంగన్‌వాడీల పొట్టలు కొట్టి ప్రభుత్వం ఎంతకాలం మనగలదని అన్నారు.


భట్టిప్రోలు : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన దీక్షలు శనివారంతో 26రోజులకు చేరాయి. అంగన్‌వాడీల శిభిరంలో నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఎన్ని నిర్భంధాలనైనా ఎదుర్కొని పోరాటం చేస్తామని అన్నారు.


కారంచేడు : అంగన్‌వాడి ఉద్యమంపై ఎస్మా ప్రయోగించడం ప్రభుత్వం పిరికిపంద చర్యని సిఐటియు నాయకులు పి కొండయ్య అన్నారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఆందోళనలో శనివారం ఆయన మాట్లాడారు. నిర్బంధం, బెదిరింపు చర్యల ద్వారా చట్టబద్ధ హక్కుల కోసం సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలను అణచివేసే చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడి నాయకులు శ్రీలక్ష్మి, క్రీస్తు రాజ్యం, కళ్యాణి, హఫీజ, శివలీల, ఆదిలక్ష్మి, రాధా పాల్గొన్నారు.

➡️