నేటికి పొలాల్లోనే వైట్ బర్లీ లేత పొగాకు : మారిన వాతావరణంతో రైతుల్లో ఆందోళన

May 26,2024 22:34 ##Inkollu #Tobaco

ప్రజాశక్తి – ఇంకొల్లు
ఏడాది మే నెల ముగిసి మళ్ళీ ఏడాది ఖరీఫ్ పంట కాలం సమీపిస్తుంది. జూన్ నెల వస్తున్న ఇంకా పొలాల్లోనే వైట్ బర్లీ లేత పొగాకు తోటలు కొట్టుడుకు వచ్చి కనిపిస్తున్నాయి. సంవత్సరం ప్రారంభం నుంచి వైట్ బర్లీ పొగాకు ధర ఆశాజనకంగా ఉండటంతో పాటు మొదట్లో మిచంగ్ తుఫానుకు తోటలు కొన్ని దెబ్బతిన్నాయి. అక్కడక్కడ పత్తి సాగు చేసిన పొలాల్లో పత్తి ఎర్ర గులాబీ పురుగుసోకి దెబ్బ తినడంతో పత్తి తొలగించి పొగ తోటలు రబిలో లేత తోటలు ఆలస్యంగా సాగు చేశారు. ఆ తోటలకు అనంతరం సంభవించిన వాతావరణ పరిణామాలతో సుదూర ప్రాంతాల నుంచి అధిక వ్యయం చేసి నీటి తడులు ట్యాంకర్ల ద్వారా, ఆయిల్ ఇంజన్ ద్వారా ఇచ్చారు. ఆ తోటలు డిసెంబర్, జనవరి నెలల్లో సాగు చేయటంతో తడిపిన కొట్టుడుకు ఇప్పటివరకు పూర్తిగా రాలేదు. ఇలాంటి లేత పొగ తోటలు ఇంకొల్లు, కారంచేడు, మార్టూరు మండలంలోని హనుమజీపాలెం, జరుబులవారి పాలెం, కేశవరప్పాడు, తిమర్థపాడు, ఇంకొల్లు తదితర గ్రామాల్లో ఇప్పటికీ పొలాల్లో తోటలు దర్శనమిస్తున్నాయి. ఆ లేత తోటల్లో అడుగు ఆకులు మాత్రమే కొట్టుడు కొట్టి పందిళ్లకు ఆకు ఎక్కించారు. ప్రధాన ఆకు కొట్టుడు, చివరికొట్టుడు ఇక కొట్టవలసి ఉంది. ఆలస్యంగా సాగు చేయడంతో ఆకు ఇంకా పక్వానికి రాలేదు. దీనికి తోడు మొన్నటి వరకు మండుతున్న ఎండలతో రైతులు సతమతమైతే మరోవైపు ప్రస్తుతం గత రెండు రోజులుగా మారిన వాతావరణంతో వర్షం పడుతుందని, వర్షం పడితే ఆకు రంగు మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే పందిళ్లకు ఎక్కిన అడుగు ఆకు తడిసి పాడైపోతుందన్న ఆందోళనతో సాగుదారులు వాపోతున్నారు. ఇప్పటికే లేత పొగ తోటలకు అధిక ఖర్చు అవ్వడంతో పాటు దిగుబడి తగ్గనుందని, దీనికి తోడు వర్షానికి ఆకు తడిస్తే మడ్డి కారిపోతుందని, రంగు పోతుందని రైతులు అంటున్నారు. ముదురు పొగకు రైతుల ఇళ్ల వద్ద నిల్వ ఉoదని, మార్కెట్ ధర ప్రస్తుతం నిలకడగా రూ.15వేలు ఉన్నప్పటికీ లేత తోటలకు ఈ ధర గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు.

➡️